ఎన్నికలలో గెలిచేందుకు పాకిస్థాన్‌ను వాడుకోవడం..! కాంగ్రెస్‌కు ముస్లింలను మాత్రమే గౌరవిస్తుందని..హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం…! దళితులను కాంగ్రెస్ అవమానించిందని.. దశాబ్దాల కిందటి ఘటనలు ఉదహరించడం…! ఏ ఊరికెళ్లినా.. కాంగ్రెస్ మిమ్మిల్ని కించ పరిచిందని వాళ్లపై జాలిచూపించడం…!. ఇదీ కర్ణాటక ఎన్నికల్లో స్థూలంగా నరేంద్రమోదీ ప్రచార సరళి. ఎక్కడా ఆయన ప్రభుత్వ విజయాలను చెప్పుకునేందుకు సాహసించలేదు. ఎప్పుడూ.. కాంగ్రెస్‌పై కులాలు, మతాలు, వర్గాల్ని రెచ్చగొట్టడమే ఎజెండాగా ఆయన ప్రచారం సాగింది.
అత్యంత నాటకీయంగా వ్యవహరిస్తూ నరేంద్రమోదీ కర్ణాటక ఎన్నికల ప్రచారం సాగుతోంది. ఆయన ఎజెండా ప్రధాని స్థాయిని దిగజార్చేలా ఉందన్న విమర్శలు వస్తున్నాయి. ప్రచారంలో అప్పుడప్పుడూ భావోద్వేగానికి గురువుతున్నట్లు కనిపిస్తున్నారు. నాటకీయతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇవి అట్టడుగుస్థాయి ప్రచార ఎత్తుగడలని రాజకీయ నిపుణులు పెదవి విరుస్తున్నారు. ఒకప్పుడు 56 అంగుళాల చాతితో దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తానో చెప్పే మోదీ.. ఇప్పుడు తనపై సానుభూతి, జాలి కలగాలన్నట్లుగా ప్రచారసభల్లో మాట్లాడుతున్నారు. పేదతల్లి బిడ్డనని, బలహీనవర్గానికి చెందిన వ్యక్తినని… తాను పైకి రావడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదన్నట్లు చెప్పుకొస్తున్నారు.
వేగంగా ఆరిపోతున్న బీజేపీ దీపాన్ని బావోద్వేగాలు రెచ్చగొట్టి అయినా మళ్లీ ఎలా వెలిగించాలన్న తాపత్రయమే ఇప్పుడు మోదీలో కనిపిస్తోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల ఆధారంగానే దేశ రాజకీయాల్లో మార్పులుంటాయి. అందుకే ప్రధాని మోదీ మరింతగా… విద్వేష రాజకీయం చేస్తున్నారు. గుజరాత్ ఎన్నికల్లోనే బీజేపీ అత్యంత కఠినమైన సవాల్ ఎదుర్కొంది. దీనికి అప్పుడు కూడా మోదీ ఇదే తరహా ప్రచారం చేసి విమర్శలు అందుకున్నారు. అక్కడ గెలిచినా.. ఆయనకు క్రెడిట్ రాకపోగా.. అదీ ఓ గెలుపేనా అన్న శాపనార్థాలు వచ్చాయి. అయినా మోదీ కర్ణాటకలోనూ అదే వ్యూహం అమలు చేస్తున్నారు. విజయానికి అడ్డదారులుండవన్నట్లు.. ఎలా గెలిచామన్నది కాదు.. గెలుపే రికార్డుల్లో ఉంటుందని.. ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే తాను ప్రధాని స్థాయిలో ఉన్నానని ఎన్నికల ప్రచార సభల్లో మర్చిపోతున్నారు.