‘ప్రేమమ్’ తరవాత హీరో నాగచైతన్య, దర్శకుడు చందు మొండేటి కలిసి చేస్తున్న సినిమా ‘సవ్యసాచి’. హిట్ కాంబినేషన్ కావడంతో సినిమాపై ఆటోమేటిక్‌గా క్రేజ్ ఏర్పడింది. క్రేజ్‌కి తగ్గట్టు బంపర్ కలెక్షన్స్ రావాలంటే సినిమాని సమ్మర్లో రిలీజ్ చేయాలనుకున్నారు. నాగార్జున ‘ఆఫీసర్’ కూడా సమ్మర్ రిలీజ్‌కి, అదీ ‘సవ్యసాచి’ రిలీజ్ చేయాలనుకుంటున్న మే సెకండాఫ్‌లో రావాలనుకుంటున్నారని తెలిసి ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. తండ్రి సినిమాకి తనయుడి సినిమా అడ్డు పడుతుందేమో అనే ఉద్దేశంతో వెనక్కి వెళ్లడం మంచిదని అనుకున్నారంతా. తరవాత జూన్ 14న సినిమా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం జూన్‌లో సినిమా వచ్చే అవకాశాలు లేవు. జూలైలో రిలీజ్ చేయాలనుకున్నార్ట. ఈసారి వాయిదా వేయడానికి కారణం తమిళ హీరో మాధవన్ అని తెలుస్తోంది. ఈ రొమాంటిక్ హీరో సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నాడు. ఫిబ్రవరి ఎండింగ్లో మాధవన్కి షోల్డర్ సర్జరీ జరిగింది. కొన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకోమని, షూటింగులు చేయవద్దని డాక్టర్లు సూచించారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో షెడ్యూల్స్ డిస్టర్బ్ అయ్యాయని, షూటింగ్ ఆలస్యం కావడంతో విడుదల వాయిదా పడిందని సమాచారం. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.