అనంతపురం జిల్లాలో ఒకప్పుడు సాగిన రక్తచరిత్ర చాలా మంది దృష్టిలో హీరోయిజం. కొంత మంది దృష్టిలో విలనిజం. మంచి,చెడూ ఏదీ వంద శాతం ఉండవు. మనకు మంచి అనేది.. మరొకరికి చెడు కావొచ్చు. మరొకరికి మంచి అయినది మనకు చెడు కావొచ్చు. దేనీకి కూడా వంద శాతం యాక్సెప్టెన్సీ ఉండదు. అలానే పరిటాల రవి చేశారు..చేయించారు అని చెప్పుకున్న రక్తచరిత్రలోనూ మంచీచెడూ రెండు ఉండే ఉంటాయి. ఇవే పరిటాల రవిని..ఓ హీరోగా.. అసాధారణ వ్యక్తిగా…అంతకు మించిన అరుదైన వ్యక్తిత్వం ఉన్నవాడిగా ప్రపంచం ముందు నిలబెట్టాయి. కానీ అన్ని విషయాల్లో తెర ముందు కనిపించేది పరిటాల రవినే. కానీ…తెరవెనుక … రవికి అండాదండాగా నిలిచింది మాత్రం…చమన్. చమన్ సాబ్.
రాజకీయాల ప్రస్తావనే లేకుండా.. విప్లవపంధాలో పీడిత, తాడితుల కోసం పరిటాల ముందడుగు వేసినప్పుడు… రవి చేయి పట్టుకున్న వ్యక్తి చమన్. అప్పట్నుంచి రవి చేయి వదిలి పెట్టలేదు. ఎన్నో దాడులు ఎదుర్కొన్నా.. అంతకు మించిన రాజకీయాలు ఇబ్బంది పెట్టినా.. ఇద్దరిదీ ఒకే మాట ఒకే బాట. పరిటాల రవి ముఖ్య అనుచరుడు చమన్ అని కొంత మంది అంటూ ఉంటారు…కానీ వారి మధ్య నాయకుడు, అనుచరుడు లాంటి బంధాలేమీ లేవు. అరే..ఒరే అనుకునే సాన్నిహిత్యమే వారికి ఉంది. తోడబుట్టిన వారి కన్నా ఎక్కువగా కలసిమెలసి బతికారు. తెర ముందు పరిటాల రవి కనిపిస్తూంటారు.ప్రత్యర్థులంతా ఆయన్నే టార్గెట్ చేసుకుంటారు. కానీ చమన్ గురించి తెలిసిన అతి కొద్ది మంది మాత్రమే ఆయన్ను టార్గెట్ చేసుకునేవాళ్లు. ఇలాంటి ధ్రెట్లు ఉంటాయనే.. చమన్ ఐడెంటిటి బయటకు తెలియకూడదని…పరిటాల తాపత్రయపడేవారు. చమన్‌కు నాటకాలంటే ఎంతో ఇష్టం. విప్లవ ఉద్యమంలో పీడితులపై తిరగబడుతున్నప్పుడే… ఎంత రిస్క్ అయినా సరే.. ఒక్కోసారి పరిటాలకు కూడా చెప్పకుండా నాటకాలు వేసేందుకు వెళ్లిపోయేవారు. శ్రీరాములయ్య సినిమా తీస్తున్నప్పుడు… తాను ఓ ప్రధాన పాత్ర పోషించడానికి సిద్ధమైపోయారు. రవి కూడా ఒప్పుకున్నారు. కానీ షూటింగ్ ప్రారంభోత్సవంలోనే జరిగిన ఎటాక్‌తో మనసు మార్చుకున్నారు. ఇప్పటి వరకు నువ్ కొంత మందికే తెలుసు.. సినిమాల్లో నటిస్తే.. అందరికీ తెలిసిపోతావు..దాని వల్ల దాడులకు అవకాశం పెరుగుతుందని ఆపేశారు. ఈ విషయాలన్నింటినీ వెబ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూల్లో చమనే గుర్తు చేశారు.
వైఎస్ సీఎం అయిన తర్వాత.. వారి హిట్ లిస్ట్ లో ఉన్న మొదటి పేరు.. పరిటాల రవి అండ్ కంపెనీ. ఈ విషయం వారికీ తెలుసు. అందుకే పరిటాల రవి.. చమన్ తో పాటు ముఖ్యమైన వారినందర్నీ ఆజ్ఞాతంలోకి పంపారు. చావైనా..రేవైనా… ఇద్దరమే వెళ్దామన్న చమన్‌ను తనపై ఒట్టేయించుకుని మరీ ఆజ్ఞాతంలోకి పంపారు రవి. తర్వాత అందరూ భయపడినట్లే జరిగింది. ప్రాణమిత్రుడి చివరి చూపును కూడా.. చమన్ చూసుకోలేకపోయారు. ఆజ్ఞాతం నుంచి బయటకు వచ్చిన తర్వాత పరిటాల ఫ్యామిలీతో.. అదే అనుబంధాన్ని కొనసాగించారు. ఆ కుటుంబానికి అండగా ఉన్నారు. పరిటాల శ్రీరామ్ పెళ్లిలోనేకాదు.. ఆది వారమే జరిగిన పరిటాల స్నేహలత పెళ్లిలోనూ.. అంతా తానై వ్యవహరించారు. స్నేహలత పెళ్లితో మిత్రుడిచ్చిన బాధ్యత తీరిపోయిందనుకున్నారమో.. వెళ్లిపోయారని.. పరిటాల అభిమానులు కంట తడి పెడుతున్నారు.