కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని ఓ సైనికుడి కథే ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. ఐదు రోజుల క్రితం విడుదలైన ఈ సినిమాలో హీరో అల్లు అర్జున్ యాక్టింగ్‌కి మంచి పేరొచ్చింది. సేమ్ టు సేమ్ క్యారెక్టర్‌లో తమిళ్ హీరో విశాల్‌కి ఎలాంటి పేరు వస్తుందో చూడాలి. ఎందుకంటే… విశాల్, సమంత జంటగా నటించిన తమిళ సినిమా ‘ఇరుంబుతిరై’. తెలుగులో ‘అభిమన్యుడు’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఇందులో కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని, కోపం ఎక్కువ కల క్యారెక్టర్‌ని విశాల్ చేశార్ట. మూడు రోజుల క్రితం విడుదలైన తమిళ ట్రైలర్ చూస్తే ‘చేశార్ట’ కాదు.. చేశారని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అందులో విశాల్ కూడా సైనికుడిగా కనిపించడం విశేషమే. క్యారెక్టర్ ఒక్కటే అయినా, కథలో కీ పాయింట్ ఒక్కటే అయినా… స్క్రీన్‌ప్లే, కథలో డిస్కస్ చేసే టాపిక్స్ డిఫరెంట్‌గా వుంటుందని ఆశించవచ్చు.
‘నా పేరు సూర్య’ దర్శకుడు వక్కంతం వంశీ కథను తండ్రీకొడుకుల అనుబంధం, కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని సైనికుడి మనసులో సంఘర్షణగా తీర్చిదిద్దితే… ‘అభిమన్యుడు’ దర్శకుడు పీఎస్ మిత్రన్ సైబర్ వార్, బయో వార్ అంశాల నేపథ్యంలో కథ రాసుకున్నాడు. ఇంటర్నెట్ కారణంగా ప్రజల సమాచారం ఎక్కడికి వెళ్తుంది? దాంతో దేశద్రోహులు ఏం చేస్తున్నారు? అనే విషయాలను డిస్కస్ చేసినట్టున్నాడు. ఇంకో విచిత్రం ఏంటంటే… ‘నా పేరు సూర్య’లో హీరో తండ్రిగా నటించిన యాక్షన్ కింగ్ అర్జున్, ‘అభిమన్యుడు’లో విలన్ క్యారెక్టర్ చేశార్ట.