పైసా వసూల్ రిజల్ట్ పక్కన పెడితే – ఆ సినిమాతో నందమూరి బాలకృష్ణ, పూరి జగన్నాథ్‌ల మధ్య అనుబంధం బాగా పెరిగింది. `పూరితో మరో సినిమా చేస్తా` అని బాలయ్య స్వయంగా చెప్పడం – పైసా వసూల్ తరవాత కూడా పూరితో బాలయ్య టచ్‌లో ఉండడం.. ఇందుకు నిదర్శనం. పూరి సొంత సినిమా `మెహబూబా` విషయంలోనూ బాలయ్య అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ఈ సినిమాకి ముహూర్తం నిర్ణయించింది బాలయ్యే. పైగా సినిమా ఎలా వస్తోంది, ఏం జరుగుతోంది? అనేది బాలయ్య స్వయంగా ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నాడు. ఈ శుక్రవారం మెహబూబా విడుదల అవుతోంది. ఈలోగా బాలయ్య కోసం ఓ షో వేయాలని పూరి భావిస్తున్నారు. సినిమా ప్రముఖులకు చూపించాలనుకుంటే.. ముందు బాలయ్య కే ఓ షో వేస్తానంటున్నాడు పూరి. “బాలయ్య ఇచ్చిన సపోర్ట్ అంతా ఇంతా కాదు. నేను పని చేసిన ఏ హీరో కూడా.. ఇలా ఫోన్లు చేసి సినిమా గురించి అడిగి తెలుసుకోలేదు. బాలయ్య స్పెషల్. అందుకే ఆయనకు ఓ షో వేయాలనుకుంటున్నా“ అని తెలుగు 360తో చెప్పుకొచ్చాడు పూరి. ప్రస్తుతం వివి వినాయక్ దర్శకత్వంలో నటిస్తున్నాడు బాలయ్య. ఆ తరవాత ఎన్టీఆర్ బయోపిక్ ఉంటుంది. ఇవి రెండూ పూర్తయ్యాక పూరికి మరో ఛాన్స్ ఇచ్చే అవకాశాలున్నాయి.