ఐదు ఆరు పాటలు, ఐదారు ఫైట్లు అన్నీ కలిపి కూడా రెండున్నర గంటల్లో సినిమా అయిపోవాలి, లేదంటే ప్రేక్షకులకు బోర్ కొడుతుంది- ఇది తెలుగు సినిమాల ట్రెండ్ గత కొన్ని దశాబ్దాలుగా. దాదాపు గత రెండు దశాబ్దాల్లో వచ్చిన సినిమాలన్నీ రెండున్నర గంటల లోపల ముగిశాయి. సస్పెన్స్ థ్రిల్లర్ లాంటి సినిమాలయితే అంతకంటే తక్కువ సమయంలోనే కూడా ముగిశాయి. అయితే అర్జున్ రెడ్డి దర్శకుడు ఏటికి ఎదురీదాడు. మూడు గంటల నిడివి తో సినిమా తీసి ఇచ్చాడు. మూడు గంటల సినిమా చూసి కూడా ప్రేక్షకులు బోర్ ఫీల్ అలవక పోవడంతో, ఆన్లైన్ వెర్షన్ లో మరి కొన్ని సీన్స్ కూడా కలిపాడు.
బహుశా అర్జున్ రెడ్డి సక్సెస్ నుంచి గ్రహించారో ఏమో మరి, కథ బాగుంటే ప్రేక్షకులు మూడు గంటలపాటు చూడడానికి ఇబ్బంది పడరు అని టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఖాయం చేసుకున్నట్టు అనిపిస్తోంది. రామ్ చరణ్ రంగస్థలం మాత్రం 2 గంటల 59 నిమిషాల రన్‌టైంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయం సొంతం చేసుకుంది . మహేష్ బాబు భరత్ అనే నేను 2 గంటల 53 నిమిషాల నిడివితో రిలీజ్ అయి మంచి విజయాన్ని సాధించింది. అల్లు అర్జున్ నా పేరు సూర్య కూడా 2 గంటల 48 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు మహానటి కూడా 2 గంటల 56 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది.
మొత్తానికి అర్జున్ రెడ్డి చిన్న సినిమాగా విడుదలై పెద్ద హిట్టు సాధించడమే కాకుండా, “ పెద్ద” సినిమాల ( నిడివి విషయంలో ) ట్రెండ్ కి కూడా నాంది పలికినట్లయింది.