‘నా పేరు సూర్య’ సినిమా విడుదలైంది. అల్లు అర్జున్ నటనకు పేరు వచ్చింది. వసూళ్లు బాగా వస్తున్నాయా? అంటే.. నిర్మాత లెక్కల ప్రకారం రికార్డులు కొడుతోంది. ఇవన్నీ పక్కన పెట్టి సినిమా విషయానికి వస్తే… అందులోకి ప్లస్సులు వున్నాయి. మైనస్సులూ వున్నాయి. మైనస్సుల్లో ‘ఇరగ ఇరగ’ సాంగ్ ప్లేస్మెంట్ గురించి ఎక్కువ డిస్కషన్ జరిగింది. ఇదే విషయాన్ని దర్శకుడు వక్కంతం వంశీని అడిగితే… అందులో తప్పంతా తనదేనని తెలిపారు. సినిమాలో పాటలన్నీ సందర్భానుసారంగా రావడంతో ఎక్కడైనా ఒక్క కమర్షియల్ మాస్ పాటను పెట్టాలని పట్టుబట్టింది తానేనని వక్కంతం వంశీ తెలిపారు. ప్రేక్షకులు ఆలోచించినట్టు ఆయన కూడా ఆలోచించార్ట. కాని సినిమాలో ఎమోషన్స్ హైఎండ్లో చూపించిన తరవాత ఒక రిలీఫ్ ఇచ్చినట్టు వుంటుందని ‘ఇరగ ఇరగ’ పాటను అక్కడ పెట్టామని తెలిపారు.
అలాగే, నిడివి ఎక్కువైందని వస్తున్న విమర్శలపైనా ఆయన స్పందించారు. “ఇద్దరు ముగ్గురు నా దగ్గర కూడా నిడివి ఎక్కువైనట్టు వుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే… ఎక్కడ ఎక్కువైందనే విషయాన్ని చెప్పలేకపోతున్నారు. ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు కాబట్టి ఎక్కడ ఏ సన్నివేశాన్ని కత్తిరించాలో తెలియడం లేదు. అక్కడికీ రెండు మూడు మంచి సన్నివేశాలను తీసేశా. త్వరలో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం” అని వక్కంతం వంశీ తెలిపారు.