రాష్ట్రంలోని 175 నియోజక వర్గాల్లో పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించేశారు! తెలంగాణలో పోటీపై మరో నెలన్నరలో స్పష్టత ఇచ్చేస్తామన్నారు. పంచాయతీ స్థాయి నుంచి పార్లమెంటు నియోజక వర్గం వరకూ పార్టీని బలోపేతం చేయడంపైనే కసరత్తు చేయబోతున్నట్టూ చెప్పారు. ఈ లెక్కన జనసేన కార్యకర్తలు ఎంత బిజీగా ఉండాలి, ఎంత జోష్ లో ఉండాలి, ఏ స్థాయిలో కార్యోన్ముఖులై ఉండాలి..? కానీ, అలా ఉన్నారా..? జనసేన వర్గాల్లో ఆ స్థాయి హడావుడి కనిపిస్తోందా..? అంటే, మిశ్రమ స్పందనే వస్తోంది. సరైన దిశానిర్దేశం లేక కార్యకర్తలు నైరాశ్యంలో ఉన్నట్టు తెలుస్తోంది.
నిజానికి, కార్యకర్తల్లో ఈ నైరాశ్యానికి కారణం జనసేన పార్టీ అసమగ్ర స్వరూపమే. పార్టీలో ఏపని చేయాలన్నా, ఏది కావాలన్నా అంతా పవన్ కల్యాణ్ అనుమతి వస్తే తప్ప ఏదీ జరగదు! ఏడాదిలో ఎన్నికలకు సిద్ధమౌతున్న ఈ తరుణంలో కూడా జనసేన పార్టీ ఏక వ్యక్తి కేంద్రీకృతంగానే కనిపిస్తోంది. ద్వితీయ శ్రేణి నేతలు ఎవ్వరూ పార్టీలో కనిపించడం లేదు. పోనీ, కొత్తగా చేరేందుకు ఇబ్బడిముబ్బడిగా వచ్చేవారూ, ఆశావహులూ ఉన్నారా అంటే… ప్రస్తుతానికి ఆ హడావుడీ కనిపించడం లేదు. తాజాగా మీడియాతో వివాదం, ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా చేసుకుని పవన్ కల్యాణ్ దూకుడు… ఇవన్నీ కొంతమంది తటస్థులను కూడా ఆలోచింపజేసే పరిణామాలుగా మారిపోయాయి. కాబట్టి, పార్టీలో పని విభజన అనేది ప్రస్తుతానికి అసాధ్యమైన ప్రక్రియగా ఉంది. కార్యకర్తలకు బాధ్యత వహించి, వారి నిర్వహణ ఎవరు చూస్తున్నారన్నదీ ప్రశ్నగానే ఉంది.
పోనీ, ఒక రాజకీయ సలహాదారుని నియమించుకుని… బాధ్యతలు బదిలీ చేసుకుందామన్నా… దేవ్ వ్యవహారంలో జనసేన అభాసుపాలు కావాల్సి వచ్చింది. దేశ విదేశీ పార్టీలతో పనిచేసిన అనుభవం తనదని దేవ్ చెప్పడం, ఆ మర్నాడే ఆయన చింతల్ బస్తీ స్థాయి భాజపా కార్యకర్త అని తేలడంతో జనసేనకు తలబొప్పి కట్టింది. సరే, సోషల్ మీడియా ద్వారానైనా జనసేన భావజాలాన్ని ఒక పద్ధతి ప్రకారం ప్రచారంలోకి తీసుకెళ్తారనుకున్నా… ట్విట్టర్ ట్రోలింగ్ కి మాత్రమే ఉన్న టీమ్ పరిమితమౌతున్నట్టుగా ఉంది! సలహాలు ఇవ్వడానికి సీనియర్లు లేరు. ఇతర పార్టీలూ ఇతర రంగాల నుంచి అనుభవజ్ఞులు వచ్చి పార్టీలో చేరతారా అంటే.. అదీ చెప్పలేని పరిస్థితి! ఉన్నవారికి అనుభవ రాహిత్యం.. సలహాదారు వాసుదేవ్ తో సహా! దీంతో కార్యకర్తలకు సరైన దిశానిర్దేశం చేసేవారే కరవైపోయారు. పోనీ, అన్నీ పవనే చూసుకుంటారా అంటే… ఆయన క్రియాశీలత తెలిసిందే. ప్రకటనల్లో వినిపించినంత ఉద్వేగమూ వేగం, ఆచరణలో కనిపించదు! ఎన్నికలకు ఏడాది ముందు కూడా ఫామ్ హౌస్ లో కూర్చుని పార్టీని నిర్మిస్తా నడిపిస్తా గెలిపిస్తా అంటుంటే పరిస్థితి ఏంటి..? ప్రస్తుతం కొంతమంది జనసేన కార్యకర్తల నుంచి వ్యక్తమౌతున్న నైరాశ్యమిది.