15వ ఆర్థిక సంఘానికి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌లో కేంద్రం నిధుల పంపిణికి 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాలని సూచించడం పెను దుమారం రేపుతోంది. ఒకప్పుడు దేశంలో జనాభా నియంత్రణను ఉద్యమంలా చేపట్టారు. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాలు ప్రగతి చూపించాయి. పకడ్బందీ చర్యలతో జనాభాను నియంత్రించాయి. కానీ ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం జనాభా నియంత్రణను లైట్ తీసుకున్నాయి. జనాభాను నియంత్రించినందుకు ప్రొత్సహకాలు ఉంటాయని కూడా అప్పట్లో ప్రకటించారు. జనాభా నియంత్రణ ఫలితాలు సాధించిన దక్షిణాది నష్టపోకుండా… ఇప్పటి వరకు 1971 జనాభా లెక్కలనే పరిగణనలోకి తీసుకుంటున్నారు. అయితే ప్రధాని నరేంద్రమోదీ.. దక్షిణాది రాష్ట్రాలను ఇప్పుడు శిక్షించాలని డిసైడయ్యారు. దుమారం రేగుతున్నా వెనక్కి తగ్గడం లేదు. 2011 జనాభా లెక్కలను.. ఆర్థిక సంఘం పరిగణనలోకి తీసుకంటే… లోక్‌సభ సీట్ల పునర్విభజన సమయంలోనూ.. ఇలాగే జరుగుతుంది. దక్షిణాది లో సీట్లు తగ్గిపోతాయని… ముఖ్యమంత్రి చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేసి… కొత్త కోణం బయటపెట్టారు.
1952 మొదటి లోక్‌సభలో మొత్తం సభ్యుల సంఖ్య 489. అయితే 1973లో 31వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ సంఖ్యను 545కు పెంచారు. దీనికి 1971 జనాభాను ప్రాతిపదికగా తీసుకున్నారు. 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నియోజకవర్గాల పునర్విభజన సంఖ్యను 2001 సంవత్సరం వరకు స్తంభింపజేశారు. దీని ముఖ్యోద్దేశం.. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు లోక్‌సభలో తమకున్న సీట్లు కోల్పోకుండా కాపాడటం. ఈ రాష్ట్రాలలో కుటుంబ నియంత్రణ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడంతో చెప్పుకోదగ్గ స్థాయిలో జనాభా తగ్గింది. దీంతో ఆయా రాష్ట్రాలలో లోక్‌సభ స్థానాలు తగ్గి, ఉత్తరాది రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్లు పెరిగాయి. ఈ వ్యత్యాసాన్ని తగ్గించడానికి పునర్విభజన ప్రక్రియను 2001 వరకు స్తంభింపజేశారు. దీన్ని 84 రాజ్యాంగ సవరణ చట్టం 2001 ద్వారా 2026 వరకు పొడిగించారు. అంటే ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాల సంఖ్య 2026 వరకు మారదు.
కేంద్రం తాజా జనగణనను పరిగణలోకి తసుకుంటే మాత్రం… దక్షిణాది లోక్ సభ సీట్లు తగ్గపోతాయి. ఉత్తరాదికి పెరుగుతుాయి. రాజ్యాంగ ప్రకరణ 329 మేరకు పునర్విభజన కమిషన్ నిర్ణయాలను న్యాయస్థానంలో ప్రశ్నించడానికి వీల్లేదు. 1967లో మేఘరాజ్ వర్సెస్ పునర్విభజన కమిషన్ వివాదంలో సుప్రీంకోర్టు ఈ విషయాన్ని ధ్రువీకరించింది. పునర్విభజన విషయంలో కమిషన్‌దే తుది నిర్ణయమని తీర్పునిచ్చింది. అంటే పార్లమెంట్లో దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గించడం అంత తేలిక కాదు కనీ అసాధ్యం మాత్రం కాదు. మరో సారి మోదీ సంపూర్ణ మెజార్టీతో గెలిస్తే… ఇది కచ్చితంగా జరిగే అవకాశం ఉంది. అందుకే చంద్రబాబు ఈ ఆందోళన వ్యక్తం చేశారు.