నటుడు శివాజీ ప్రత్యేక హోదాపై గళమెత్తడం, దీక్షలు చేయడం, ప్రత్యేక హోదా ఉద్యమానికి చలసాని తదితరులతో ముందుకు రావడంతో తెలుగు ప్రజల దృష్టిలో చక్కటి ఇమేజ్ కలిగి ఉండేవాడు. శివాజీ నిస్వార్థంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నాడు అంటూ ప్రజలు భావించేవారు. అయితే ఇదంతా ఒకప్పుడు. గత కొద్దికాలంగా శివాజీ చేస్తున్న వ్యాఖ్యలు అన్నీ కూడా కేవలం తెలుగుదేశం పార్టీని బలపరచడానికి చేస్తున్నారని ఖరారు కావడంతో ప్రజలు కూడా నెమ్మదిగా శివాజీ ని లైట్ తీసుకున్నారు. ప్రత్యేకించి శివాజీ ప్రకటించిన ఆపరేషన్ గరుడ ఎపిసోడ్ ని నెటిజన్లు బాగా ట్రోల్ చేశారు. అలాగే కర్ణాటకలో కాంగ్రెస్‌కు ఓటు వేయమని పిలుపునివ్వడం, చంద్రబాబు ధర్మదీక్ష లో కనిపించడం ఇవన్నీ చూశాక శివాజీ పూర్తిగా తెలుగుదేశం మద్దతుదారుడిగా ముద్ర వేయబడ్డాడు. ఎప్పుడైతే అలాంటి ముద్ర పడిందో, అప్పట్నుంచి ఇతర పార్టీల మద్దతుదారులు శివాజీ ప్రతి వ్యాఖ్య నిశితంగా పరిశీలించడం, అందులో ఏది చంద్రబాబు చంద్రబాబుకి ప్రయోజనం కలిగిస్తున్నాయి, ఈ వ్యాఖ్య ఏ ప్రయోజనం కోసం చేస్తున్నాడు ఇలాంటివన్నీ నెటిజన్లు, ఇతర పార్టీల మద్దతుదారులు విశ్లేషించడం ప్రారంభించారు. అలాంటి కోవలోనే శివాజీ తనకు తానుగా తన అజ్ఞానాన్ని బయటపెట్టునేలా వ్యాఖ్యానించిన ఒక వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంతకీ శివాజీ ఏమన్నాడంటే – బిజెపి పార్టీ ఈవీఎంల ట్యాంపరింగ్ కోసం ప్రయత్నిస్తోందని, అయితే ఈ ట్యాంపరింగ్ కర్ణాటక ఎన్నికల కోసమా లేక 2019 ఎన్నికల కోసమా అనేది తనకు తెలియదని, ఏదిఏమైనా బిజెపి మాత్రం ఈ పని మీదే ఉందని, దీనికోసం ఇజ్రాయిల్ కి సంబంధించిన మసాద్ అనే వ్యక్తి బొంబాయి లో కూర్చుని పని చేస్తున్నాడని, ఆ సమాచారం తనకు వచ్చిందని అన్నాడు.
అయితే ఇందులో ట్విస్ట్ ఏమిటంటే, మసాద్ అనేది వ్యక్తి పేరు కాదు. అసలు ఆ పేరు మసాద్ కూడా కాదు. అది మొసాద్ . ఇజ్రాయిల్ కి సంబంధించిన “ఇంటెలిజెన్స్ మరియు స్పెషల్ ఆపరేషన్స్ ఇన్స్టిట్యూట్” . అంటే ఒక సంస్థ పేరు ఇది. మనకు NIA ఎలాగైతే ఒక సంస్థ గా ఉందో, అలాగే మొసాద్ అనేది ఇజ్రాయిల్‌కు చెందిన నిఘా సంస్థ. మరి ఈ మసాద్ అనే సంస్థ ఎప్పుడు మసాద్ అనే వ్యక్తి లా మారిందో, ఆ వ్యక్తి బొంబాయిలో వచ్చి ఎలా కూర్చున్నాడో కేవలం శివాజీ తెలియాలి. ఈ లెక్కన NIA అనే వ్యక్తి, సి.బి.ఐ అనే వ్యక్తి, ఎల్ఐసి అనే వ్యక్తులు కూడా వుంటారేమో శివాజీ ఏ చెప్పాలి అంటూ నెటిజన్లు శివాజీని ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి ఆపరేషన్ గరుడ సమయంలో ఎలాగైతే ట్రోల్ చేయబడ్డాడో, ఇప్పుడు అంతకంటే ఎక్కువగా శివాజీ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాడు