ఓటుకు నోటు కేసుపై తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. దాదాపు రెండేళ్లపాటు మౌనంగా ఉన్న కేసీఆర్, ఇప్పుడే ఈ కేసుపై ఎందుకు సమీక్ష అన్నారంటూ చర్చ మొదలైంది. ఎన్డీయే నుంచి ఏపీ సీఎం చంద్రబాబు బయటకి వచ్చారు కాబట్టి, ఇది భాజపా ప్రేరేపిత చర్యగా కొందరు చూస్తున్నారు. ఇంకోపక్క… ఫెడరల్ ఫ్రెంట్ అంటూ కేసీఆర్ ప్రయత్నాలు మొదలుపెట్టారు కాబట్టి, తన రాజకీయ లక్ష్యానికి చంద్రబాబు అడ్డు రాకూడదన్న ఉద్దేశంతోనే ఈ ఫైలు తీశారని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా, అధికారంలో ఉన్నవారికి కేసులు అనేది తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు అనువుగా వాడుకునే అస్త్రాలుగా మారిపోవడం శోచనీయం. ఇప్పటికిప్పుడు ఓటుకు నోటుపై ఎంత హడావుడి మొదలైనా, అంతిమంగా ఏదో జరిగిపోతుందని ఎవ్వరూ అనుకోవడం లేదు! ఎందుకంటే, ఇంతకంటే గొప్పగొప్ప కేసులే తుస్సుమంటున్నాయి! దశాబ్దాలుగా అతీగతీ లేేని కేసులే చాలా ఉన్నాయి.
రాజకీయ అవసరాలుంటే కేసుల గాలి తీసేయడం, లేకుండా చర్యలంటూ హడావుడి అనేది సర్వసాధారణ విషయమైపోయింది. మైనింగ్ అక్రమాలకు పాల్పడ్డ గాలి జనార్థన్ రెడ్డి పరిస్థితి ఏమైంది..? భాజపా కేంద్రంలో అధికారంలోకి రాగానే బెయిల్ వచ్చేసింది. అక్రమ మైనింగ్ కేసునే నీరు గార్చేందుకు వీలున్న లొసుగుల్ని ఛార్జిషీటులో జతపరచారంటూ ఈ మధ్య కొన్ని డాక్యుమెంట్లు బయటకి వచ్చాయి. 2016లో ఎడ్యూరప్పపై నమోదైన కేసులన్నీ కొట్టుకుపోయాయి! సంచలనం రేపిన 2 జీ కేసు ఏమైంది..? భవిష్యత్తులో తమిళనాట రాజకీయ అవసరాలుంటాయనే ఉద్దేశంతో కరుణానిధిని మోడీ కలిశారు. ఆ వెంటనే, రాజా, కనిమొళి నిర్దోషులైపోయారు! ఇవన్నీ భాజపా రాజకీయ అవసరాల నేపథ్యంలో జరిగినవే కదా! కేసుల్ని నీరు గార్చడం మాత్రమే కాదు.. అవసరమైతే మరింత వేగంగా పరుగులు తీయించి మరీ కొంతమంది విషయంలో చర్యలు చేపడుతున్న వైనాన్నీ చూస్తున్నాం. బీహార్ లో చూస్తే.. లాలూ కేసుల విషయంలో త్వరత్వరగా తీర్పులు వచ్చేస్తాయి. ఇక, ఢిల్లీలో అయితే సందు దొరికితే చాలు అరవింద్ కేజ్రీవాల్ పై చర్యలుంటాయంటూ సిద్ధంగా ఉన్నారు!
ఏపీలో వైకాపా కూడా ఈ మధ్య భాజపా చుట్టూ ఎందుకు ప్రదక్షిణలు చేస్తోంది..? రాష్ట్ర ప్రయోజనాలు అని ప్రజలకు చూపిస్తున్న బొమ్మ వెనక బొరుసు… ఆ పార్టీ అధినేతపై కేసులు ఉండటమే బలమైన కారణం కదా! కేసుల పేరుతో ఎవర్ని ఎలా దారిలోకి తెచ్చుకోవాలో అధికార పార్టీలకి అలవాటైన క్రీడగా మారిపోయింది. ఇలా స్వార్థ ప్రయోజనాలకు కేసుల్ని వాడుకోవడం ఏమాత్రం సమర్థనీయం కాదు. కానీ, నేటి రాజకీయాల్లో అదే ప్రధానాస్త్రంగా వాడేస్తున్నారు. అందువల్ల, ఈ కేసులు బయటకి రాగానే అద్భుతాలు జరిగిపోతాయనో, దోషులకు కఠినంగా శిక్ష పడిపోతాయనే నమ్మకం సామాన్యులకే లేదు. ఇదొక రాజకీయ క్రీడ. అంతే, అంతకుమించి దీన్ని ప్రధానాంశంగా ఎవ్వరూ చూడటం లేదు. కానీ, కేసుల విషయంలో అధికార పార్టీలు ఇలా వ్యవహరిస్తూ ఉండటం ఏమాత్రం సమర్థనీయమైన పరిణామం కాదు.