జనసేన అధినేత పవన్ కల్యాణ్ త్వరలో రాష్ట్రవ్యాప్త బస్సుయాత్రకు బయలుదేరుతున్న సంగతి తెలిసిందే. పార్టీపరంగా జనసేనకు అత్యంత కీలకమైన యాత్ర ఇది. పార్టీ అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలనపై అర్థవంతమైన విమర్శలూ ఆరోపణలతో ప్రశ్నించాల్సిన సమయమిది. అయితే, పవన్ యాత్ర విషయంలో మీడియా వైఖరి ఎలా ఉండబోతోందనేదే కీలకంగా మారింది. ఎంత హోమ్ వర్క్ చేసుకుని ప్రసంగాలు తయారు చేసి ప్రజల్లోకి వెళ్లినా, మీడియాలో ప్రసారమైతేనే విస్తృత ప్రాధాన్యత వస్తుంది. రాష్ట్రస్థాయి అటెన్షన్ ఉంటుంది. కానీ, పవన్ విషయంలో ముఖ్యంగా ఆ మూడు మీడియా సంస్థలూ ఇప్పటికే ఒక నిర్ణయంతో ఉన్నాయి! టీవీ 9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, మహాటీవీ… పవన్ చేపట్టబోతున్న బస్సుయాత్రను కవర్ చేసేందుకు సిద్ధంగా లేవని తెలుస్తోంది.
కారణం పవన్ స్వయంకృతమే! ఈ మధ్యనే, మీడియాపై వార్ ప్రకటించి, ట్వీట్ల మీద ట్వీట్లు రాసిన వైనాన్ని చూశాం. టీవీ 9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, మహాటీవీ… ఈ మూడు ఛానెల్స్ అధినేతలపై ఇష్టం వచ్చిన పదజాలం వాడుతూ.. తాను చదివిన పుస్తకాల్లోంచి సేకరించుకున్న నీతి వాక్యాలు, తనకు తోచిన ఆపాదింపులతో రాసిన ఘాటు వ్యాక్యాలతో రచ్చ చేశారు. ఇదే సందర్భంలో.. జనసేనకు సంబంధించిన కార్యక్రమాలకు ఆ మూడు ఛానెల్స్ ని రానివ్వొద్దని డిసైడ్ అయిపోయారు! తమ పార్టీ కార్యకలాపాలను వారు కవర్ చేయాల్సిన అవసరం లేదనీ అనేశారు. దీంతో పవన్ ట్వీట్ల గురించిగానీ, జనసేన పార్టీ గురించిగానీ ఈ ఛానెల్స్ కథనాలు ప్రసారం చేయడం ఆపేశాయి. ఈ క్రమంలో పవన్ బస్సుయాత్ర అని ప్రకటించినా కూడా… కవరేజ్ కోసం వారు ఎలాంటి ప్లానింగ్స్ చేసుకోవడం లేదు.
అయితే, చేతులు కాలిపోయాక ఆకులు పట్టుకున్నట్టుగా… జనసేనకు చెందిన కొంతమంది ఈ మూడు ఛానెల్స్ ని తాజాగా సంప్రదించారట! పవన్ బస్సుయాత్రకు కవరేజ్ ఇవ్వాలంటూ వారిని కోరారట. దీనికి వారు నిరాకరించినట్టు తెలుస్తోంది. అయితే, పవన్ నుంచి బహిరంగ క్షమాపణ కోసం ఆ ఛానెల్స్ చూస్తున్నట్టు సమాచారం. నిజానికి, ఆ పని పవన్ చేస్తారా అనేదే అనుమానం..? పవన్ వెనక ఉన్నవాళ్లు చేయనిస్తారా అనేది మరింత బలమైన అనుమానం..? జనసేన పార్టీ భవిష్యత్తు, ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం… ఇవన్నీ ఏడాదిలోపు జరగాలి. అంటే, ఒక కొత్త పార్టీగా ఇంత భారీ అజెండా భుజాన ఉన్నప్పుడు, ఆ పార్టీ అధినేతగా ఎంత వ్యూహాత్మకంగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఒక వ్యక్తిగత అంశాన్ని తీసుకుని… తదుపరి పరిణామాలపై కనీసమైన అంచనా లేకుండా ఆగ్రహావేశాలు వెళ్లగక్కేస్తే ఏం జరుగుతుంది..? ఇప్పుడు జనసేనాని ఫేస్ చేస్తున్నది ఇదే.