ఎన్నికల సమయంలో మీడియా సంస్థలు, రాజకీయ పార్టీలు చేయించే సర్వేలు ఒక ఎత్తు అయితే… లగడపాటి రాజగోపాల్ చేయించే సర్వేలు మరో ఎత్తు. వాస్తవ ఫలితాలకు అత్యంత సమీపంగా ఉంటాయనే నమ్మకం ఆయన సర్వేలపై ఉంటుంది. చాలా సందర్భాల్లో ఆయన సర్వే ఫలితాలే నిజమయ్యాయి కాబట్టి, ఇప్పుడు కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కూడా ఆయన ఏం చెబుతారా అని చాలామంది ఎదురుచూస్తున్నారు. అయితే, నేరుగా ఆయన పేరు ప్రస్థావించకపోయినా… కచ్చితత్వంతో సర్వేలు చేయించే ఓ ప్రముఖ నాయకుడి అంచనా ఇదీ అంటూ తాజాగా ఓ కథనం ప్రచారంలోకి వచ్చింది. కర్ణాటక ఎన్నికలపై ఒక సాధారణ అంచనా ఏంటంటే… ఓ నెల కిందట, కాంగ్రెస్ కి తిరుగులేదన్నారు. ఆ తరువాత, హంగ్ వస్తుందన్న సర్వేలూ వచ్చాయి. ఇప్పుడా ప్రముఖ రాజకీయ నాయకుడు చేయించిన సర్వే ఏం చెబుతోందంటే… కన్నడనాట కూడా కాంగ్రెస్ కనుమరుగు కాబోతోందని!
ఆ సర్వే ప్రకారం భాజపాకి కర్ణాటకలో 110 నుంచి 120 అసెంబ్లీ స్థానాలు దక్కే అవకాశం ఉందట! కాంగ్రెస్ కి 70 నుంచి 80, జె.డి.ఎస్.కి 40 స్థానాలు దక్కే అవకాశం ఉందని ఆ సర్వేలో తేలినట్టు సమాచారం. కర్ణాటకలో పరిపూర్ణ మెజారిటీతో భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని సర్వేలో తేలినట్టు సమాచారం. నిన్నమొన్నటి వరకూ కర్ణాటకలో హంగ్ తప్పదనే వాతావరణం కనిపించినా, క్షేత్రస్థాయిలో భాజపాకి కొంత అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నట్టు ఆ బృందం స్పష్టం చేసింది. అంతేకాదు, కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ కేవలం రెండు లేదా మూడు వేల ఓట్ల తేడాతో ఓటమి పాలౌతుందని చెప్పింది.
అయితే, జాతీయ స్థాయిలో ప్రముఖ విశ్లేషకుల లెక్కలు మరోలా ఉన్నాయి. ప్రముఖ ఎనలిస్ట్ నీరజ్ చౌదరి, కర్ణాటకలో పర్యటిస్తూ వేసిన అంచనా ఏంటంటే… భాజపాకి 90, కాంగ్రెస్ కి 100, జె.డి.ఎస్. కి 30, ఇతరులకు 3 స్థానాలు దక్కుతాయన్నారు. సంజీవ్ శ్రీవాస్తవ్ సర్వేలో కూడా భాజపాకి 90, కాంగ్రెస్ కి 97, జె.డి.ఎస్.కి 30, ఇతరులకు 6 అని అంటున్నారు. ప్రముఖ పాత్రికేయుడు తెహసీన్ పూనేవాలా సర్వే అయితే.. భాజపాకి 63, కాంగ్రెస్ కి 123, జె.డి.ఎస్. 23, ఇతరులకు 14 అన్నారు. అంటే, కాంగ్రెస్ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. ఆనంద్ సింగ్ నర్సింహన్ సర్వే అయితే.. భాజపాకి 112, కాంగ్రెస్ కి 82, జేడీఎస్ కి 27 వస్తాయన్నారు. ఇలా జాతీయ స్థాయిలో కొంతమంది ప్రముఖులు నిర్వహించిన సర్వేల్లో హంగ్ తప్పదనే ఎక్కువమంది చెబుతున్నారు. వీరంతా కర్ణాటకలో పర్యటించి వేసిన అంచనాలివి!
అయితే, తాజాగా వార్తల్లోకి వచ్చిన ప్రముఖ రాజకీయనాయకుడి సర్వే కావొచ్చు, జాతీయస్థాయిలో ప్రముఖ ఎనలిస్టులు, కొన్ని సర్వే సంస్థలు చెబుతున్న అంకెలు కావొచ్చు… జె.డి.ఎస్. కి 30 నుంచి 40 సీట్లు మాత్రమే వస్తాయని అంటున్నారు. అంతకుమించి స్వతంత్ర శక్తిగా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే స్థాయి ఫలితాలను ఆ పార్టీ నమోదు చేస్తుందని ఎవ్వరూ చెప్పకపోవడం గమనార్హం.