మహానటిలో ఎన్టీఆర్‌గా మనవడు జూ.ఎన్టీఆర్ కనిపించే అవకాశం వచ్చింది. ‘తాతయ్య పాత్ర చేసే అర్హత నాకు లేదు’ అంటూ హుందాగా ఆ అవకాశాన్ని వదలుకున్నాడు. ఇప్పుడు ‘మహానటి’ సూపర్ డూపర్ హిట్టయిపోయింది. దీన్నో క్లాసిక్ అంటున్నారు సినీ ప్రేమికులు. ఇంత గొప్ప చిత్రంలో అవకాశాన్ని వదులుకున్నందుకు ఎన్టీఆర్ తప్పకుండా బాధపడుతుంటాడు. ‘తాతయ్య పాత్ర చేసే అర్హత లేదు’ అని ఎన్టీఆర్ చెప్పడం సమంజసమే. కాకపోతే ఎన్టీఆర్ కంటే అర్హమైన వాళ్లు ఎవరూ లేరు. ఏఎన్నార్ పాత్రని చేసే అర్హత చైతూకి ఉందా? తాను చేయలేదా? ఆ మాత్రం రిస్క్ ఎన్టీఆర్ ఎందుకు చేయలేకపోయాడు. ఎన్టీఆర్ గనుక ఈ పాత్ర చేయడానికి ముందుకొస్తే.. మరో నాలుగైదు సన్నివేశాలు కలిసేవి. ఎన్టీఆర్ – సావిత్రిల అనుబంధం ఎలాంటిదో ఈ తరం వాళ్లకు తెలిసేది. ఎన్టీఆర్ ‘నో’ చెప్పడంతో ఎన్టీఆర్ పాత్రని కేవలం ఒక్క ఫ్రేముకే పరిమితం చేశారు. కాకపోతే అది కూడా మహా గొప్పగా పేలింది. ఆ మాత్రం దానికే.. నిజంగా ఎన్టీఆర్‌ని తెరపై చూసినంత సంబరపడిపోతున్నారు అభిమానులు. ఎన్టీఆర్ ఓకే అంటే… నిజంగా నటించి ఉంటే, మహానటి స్థాయి కూడా మరో మెట్టు పెరిగేది. ఎన్టీఆర్ ఓకే అనుంటే ‘మహానటి’ ఏమయ్యేదో తెలీదు గానీ, ‘నో’ చెప్పడం వల్ల ఓ మంచి అవకాశాన్ని ఎన్టీఆర్ కోల్పోయినట్టంది. సోషల్ మీడియాలో కూడా ‘ఎన్టీఆర్ ఎన్టీఆర్‌గా కనిపించి ఉంటే.. ఎంత బాగుండేదో’ అని అభిమానులు చర్చించుకుంటున్నారు. వాళ్ల మనసులో మాట ఈపాటికి ఎన్టీఆర్‌కి ఈపాటికి చేరిపోయే ఉంటుంది.