పాపం… బాలయ్య సినిమాకి ఎన్ని అవాంతరాలో, ఇంకెన్ని అడ్డంకులో? తన తండ్రి జీవిత కథ ప్రపంచానికి తెలియజేయాలన్న తలపుతో ఓ బృహత్తర ప్రయత్నానికి శ్రీకారం చుట్టాడు. ఎన్టీఆర్ కథ సినిమాగా అంటే… దానికంటే కమర్షియల్ పాయింట్ ఇంకోటి ఉండదు. సో… బాలయ్య తొలి సక్సెస్ అక్కడే అందుకున్నాడు. కానీ ఈ ప్రాజెక్టు నడిపించడం అంత తేలికైన విషయం కాదని రాను రానూ బాలయ్యకు అర్థం అవుతోంది. తేజ దర్శకుడిగా తప్పుకున్నాడు. మిగిలిన వాళ్లు ‘ఐ యామ్ సారీ’ అంటున్నారు. దాంతో బాలకృష్ణ ఈ బాధ్యతని తన భుజాలపై వేసుకున్నాడు. బయోపిక్ తెరకెక్కించడం కత్తిమీద సామే. అందులో పాజిటీవ్ తో పాటు నెగిటీవ్ అంశాల్నీ టచ్ చేయాలి. లేదంటే.. అది బయోపిక్ అనిపించుకోదు. కానీ బాలయ్య మాత్రం ‘పాజిటీవ్’ కోణంలోనే ఆలోచించి స్క్రిప్టు రెడీ చేశాడు. నటీనటుల ఎంపిక అంత ఆషామాషీ వ్యవహారం కాదని తేలిపోయింది. ఎన్టీఆర్‌గా బాలయ్య తప్ప మరో పాత్ర ఎవరు పోషిస్తున్నారు? అనే విషయంలో ఇప్పటి వరకూ క్లారిటీ రాలేదు. కొంమంది నటీనటుల్ని సంప్రదిస్తే.. వాళ్లు కూడా మొహమాటం లేకుండా చేతులెత్తేస్తున్నారు. ఇప్పటికే బయోపిక్ సెట్స్‌పైకి వెళ్లడం ఆలస్యమైపోయింది. ఇప్పుడు కొత్తగా వినాయక్ సినిమా ఒప్పుకున్నాడు బాలయ్య. అది పూర్తయ్యే సరికి మరో ఆరు నెలల సమయం పడుతుంది. ఈలోగా బయోపిక్ గురించి ఎన్టీఆర్ పురనాలోచనలో పడినట్టు తెలుస్తోంది. ‘ఈ ప్రాజెక్ట్ పక్కన పెట్టేద్దామా’ అంటూ తన సన్నిహితులతోనూ చర్చించినట్టు సమాచారం.
అయితే… ఇంత ఆర్భాటంగా సినిమా మొదలెట్టి, ఉపరాష్ట్రపతినీ ఓపెనింగ్‌కి పిలిచి, ఇప్పుడు సినిమా ఆపేయడం కరెక్ట్ కాదని బాలయ్య వెనుకంజ వేస్తున్నాడు. అంతేకాదు.. దర్శకత్వ బాధ్యత కూడా తనే భుజాలపై వేసుకున్నాడు బాలయ్య. ఇప్పుడు ఈ సినిమా ఆగిపోతే… తన ఇమేజ్‌కి నష్టం. ఇప్పటికే ‘నర్తనశాల’ మొదలెట్టి, ఆపేశాడన్న పేరు తెచ్చుకున్నాడు బాలయ్య. తన ప్రతీ ఇంటర్వ్యూలోనూ ‘నర్తనశాల’ ప్రస్తావన తీసుకొస్తుంటాడు. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్‌నీ ఆపేస్తే.. దానికి గల కారణం ప్రతీసారీ చెప్పుకుంటూనే ఉండాలి. ఏదో ఒకటి అయ్యింది.. సినిమా తీసేద్దాం.. అని మొండిగానే ఉన్నా.. చాలా ప్రతికూలతలు బాలయ్యని భయపెడుతున్నట్టు తెలుస్తోంది. బాలయ్య అసలే మొండిఘట్టం. ఇలాంటి అవాంతరాలు ఎదురైన కొద్దీ… మొండిగా మారిపోతుంటాడు. మరి ఎన్టీఆర్ బయోపిక్ విషయంలోనూ బాలయ్య మొండిగానే ఉంటాడా, లేదంటే. నర్తనశాల సమయంలో వెనుకడుగు వేసినట్టు ఈ ప్రాజెక్టుని పూర్తిగా పక్కన పెట్టేస్తాడా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిందిప్పుడు.