హిట్టు సినిమా కళే వేరు. ఎన్ని సక్సెస్ మీట్లు పెట్టినా.. ఆ వేడుకలు కళకళలాడిపోతుంటాయి. `భరత్ అనే నేను` విజయోత్సవాలు ఎన్ని చూళ్లేదూ…? సినిమా కాస్త అటూ ఇటూ అయితే ఎంత హంగామా చేసినా ఆ కళ రాదు. ‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’ పరిస్థితి ఇలానే ఉంది. శుక్రవారం విడుదలైన ఈ సినిమాకి తొలి షో నుంచే డివైడ్ టాక్ వచ్చేసింది. దానికి తగ్గట్టు వసూళ్లూ బాగా మందగించాయి. థ్యాంక్యూ ఇండియా సక్సెస్ మీట్ పేరుతో పవన్ కల్యాణ్‌ని అతిథిగా రంగంలోకి దింపి కాస్త హంగామా చేయాలనుకున్నాడు సూర్య. అదీ జరిగింది. ఈరోజు హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటెల్ ప్రాంగణంలో సక్సెస్ మీట్ నిర్వహించారు. పవన్ కల్యాణ్ వస్తున్నాడంటే ఆ హంగామా ఏ స్థాయిలో ఉండాలి? కానీ ‘సూర్య’ వేడుకలో అవేం కనిపించలేదు. హాజరైన అభిమానులూ అంతంత మాత్రమే. ఒక్కరి మొహంలోనూ కళ లేదు. దర్శకుడు, నిర్మాత, ఆఖరికి అల్లు అర్జున్ కూడా ముక్తసరిగా మాట్లాడి మైక్ ఇచ్చేశారు. పవన్ ప్రసంగం కూడా అంతంత మాత్రమే. ‘రంగస్థలం’ సక్సెస్ మీట్లో దాదాపు అరగంట మాట్లాడిన పవన్.. ఈసారి రెండు నిమిషాల్లోనే తన ప్రసంగం ముగించాడు. పైగా ఈ సినిమా పవన్ చూళ్లేదట. రంగస్థలం చూసి ఆ సక్సెస్ మీట్ కి వచ్చిన పవన్ పూనకం వచ్చినట్టు మాట్లాడాడు. ఈ సినిమా పవన్ చూడలేదు. ఆ తేడా స్పష్టంగా కనిపించింది. అన్నింటికంటే ముఖ్యంగా అరగంటలో ఈ కార్యక్రమం మొత్తం ముగిసిపోయింది. దాన్ని బట్టి `సూర్య` హంగామా ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవొచ్చు.