రవితేజ సిగ్గు లేకుండా నటిస్తారని ఎవరైనా అంటే గొడవలు అవుతాయేమో! తిట్టు కిందో? కామెంట్ కిందో? అర్థం చేసుకోవాలేమో! అదీ రవితేజతో నేరుగా ఎవరైనా చెబితే ఆయన ఎలా తీసుకునేవారో? కాని అక్కడ ఆ మాట అన్నది పవన్ కల్యాణ్. సో… రవితేజ ప్రశంస కింద స్వీకరించారు. మాస్ మహారాజ్ రవితేజ నటించిన ‘నెల టికెట్టు’ సినిమా ఆడియో వేడుకకు ప్రత్యేక అతిథిగా పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ హాజరయ్యారు. ఇద్దర్నీ ఓ వేదిక మీద ప్రేక్షకులు చూడటం ఇదే తొలిసారి. కాని వేడుక చూస్తుంటే వాళ్లిద్దరూ తొలిసారి కలిసినట్టుగా ఎక్కడా కనిపించదు. ఆద్యంతం నవ్వుతూ కనిపించారు. వేదిక మీదకు వచ్చాక తామిద్దరం పదేళ్ల నుంచి స్నేహితులమని రవితేజ చెప్పారు. అంతకు ముందు ఎక్కువ కలిసేవాళ్లమని, ఇప్పుడు పవన్ బిజీ కావడంతో కుదరడం లేదని ఆయన తెలిపారు. ఇవన్నీ పక్కన పెడితే… రవితేజ స్పీచ్‌లో పదేళ్ల క్రితం పవన్ ఆయనతో అన్న మాటను చెప్పడం హైలైట్. “చాలామంది మనకు కాంప్లిమెంట్స్ ఇస్తారు. అందులో కొన్ని బాగా గుర్తుంటాయి. వాటిలో పవన్ కల్యాణ్ గారు ఇచ్చిన కాంప్లిమెంట్ ఒకటి. పదేళ్ల క్రితం ఎవరికో కాల్ చేస్తే పక్కన పవన్ వున్నారు. ఆయన ఫోన్ తీసుకుని మాట్లాడారు. మధ్యలో ‘మీరంత సిగ్గు లేకుండా ఎలా నటిస్తారండీ!’ అన్నారు. నాకు వచ్చిన కాంప్లిమెంట్స్ లో అది ఒకటి” అని రవితేజ పేర్కొన్నారు. రవితేజ చాలా సరదాగా వుంటారని ప్రతి ఒక్కరికీ తెలుసు. ప్రశంసలను సైతం అంతే సరదాగా తీసుకుంటారని ఈ మాటలతో మరింత తెలుస్తుంది. పవన్ మాటలను రవితేజ ప్రశంసలుగా తీసుకోవడం గ్రేట్.