కర్ణాటక ఎన్నికల ప్రచారం ముగిసింది. కానీ, అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేసినంత ధీమాగా భాజపా నేతలు మాట్లాడుతున్నారు. కర్ణాటకలో పనైపోయింది, ఇక ఆంధ్రప్రదేశ్ పైనే తమ దృష్టంతా అన్నట్టుగా భాజపా వైఖరిలో మార్పు కనిపిస్తోంది. ఏపీ రాజకీయాల్లో కొన్ని రోజుల్లోనే అనూహ్య మార్పులు తప్పవంటున్నారు రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్సింహారావు! అంతేకాదు, ఈ మార్పులను అందిపుచ్చుకునేందుకు అన్ని పార్టీలూ సిద్ధంగా ఉండాలని కూడా చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాష్ట్రంలో ఏకపక్షంగా ప్రచారం చేసుకుంటోందని, వాటిని సరైన రీతిలో తిప్పికొడతామన్నారు.
ఆంధ్రాకి కేంద్రం చాలా చేసిందనీ, దాని వల్లనే ఏపీ అభివృద్ధి చెందిందని జీవీఎల్ చెప్పుకొచ్చారు. కానీ, కేంద్ర సాయాన్ని ప్రజలకు టీడీపీ చెప్పకుండా, అంతా తమ ఖాతాలో వేసుకుంటోందని ఆయన విమర్శించారు. కేంద్రం ఇచ్చిన నిధులతో విలాసాలు, విదేశీ యాత్రలు, దీక్షలు చేసేందుకు ఖర్చు చేయకుండా.. రైతులకు ఖర్చు చేసి ఉంటే ఎంతో మేలు జరిగేదన్నారు. ఎన్నికల సమయం రాగానే పక్క రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందులే ఏపీ ప్రభుత్వానికి తప్పవన్నట్టుగా హెచ్చరించడం గమనార్హం! అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్న టీడీపీ సర్కారుకు ఇబ్బందులు తప్పవన్నారు.
ఇంతకీ, ఆంధ్రాకి కేంద్రం చేసిన సాయమేంటో కొత్తగా ఏపీ మీద ప్రేమ ఒలకబోస్తున్న జీవీఎల్ చెప్పగలరా..? ఆంధ్రాకి ఏం చేసిందనేది కేంద్రమంత్రిగా ఉండగా వెంకయ్య నాయుడే చెప్పలేకపోయారు. నిన్నమొన్నటి వరకూ రాష్ట్ర భాజపా అధ్యక్షుడిగా ఉన్న కంభంపాటి హరిబాబు కూడా ఎంతసేపూ ‘85 హామీలు పూర్తి చేశాం చేశాం’ అనేవారే తప్ప.. అవేంటనేవి వివరాలు ఇవ్వలేకపోయారు. ఏమైనా అంటే… విద్యా సంస్థలు ఇవ్వలేదా అంటారు! ఆ విద్యా సంస్థలకు బడ్జెట్ లో కేటాయించిన నిధులు ఏపాటివో తెలీదా..? ఓహో, కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత ఏపీపై జీవీఎల్ కి ప్రేమ పుట్టింది కాబట్టి, ఆ బడ్జెట్ లో ఏపీకి జరిగిన కేటాయింపులు ఆయనకి తెలిసినట్టు లేదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణ బాధ్యత కేంద్రానిది కాదా..? దానికి ఇచ్చిన నిధులు, ఒక విగ్రహ నిర్మాణానికి కేటాయించిన మొత్తం కంటే తక్కువగా ఉన్నాయని జీవీఎల్ కి తెలీదు.
అయినా, కేంద్ర ప్రభుత్వం… రాష్ట్రాలను హెచ్చరించడం, బెదిరించడం అనేది ఎప్పుడైనా చూశామా..? పక్క రాష్ట్రంలో పట్టిన గతే ఆంధ్రాకీ పడుతుందని హెచ్చరించడానికి ఈ జీవీఎల్ ఎవరు..? కేంద్ర, రాష్ట్రాల మధ్య ఫెడరల్ స్ఫూర్తి ఉండాలన్న విషయం ఈయనకు తెలీదా..? కేంద్రం నిధులు ఇచ్చిందీ, రాష్ట్రం ప్రచారం చేసుకుంటోంది అంటున్నారు. పాలన అంటే కేవలం ప్రచారమేనా..? అయినా, రాష్ట్రాలకు నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిది. అదేదో భాజపా పార్టీ ఫండ్ నుంచి ఇస్తున్నది కాదు కదా! అలాంటప్పుడు, ప్రచారం అనే మాట ఎక్కడి నుంచి వస్తుంది..? కేంద్ర కేటాయింపులపై, ఆంధ్రా సమస్యలపై కనీస అవగాహనా అధ్యయనం లేకుండా జీవీఎల్ హెచ్చరించేస్తుంటే ఏమనుకోవాలి..?