సంక్షమ పథకాల ప్రథమ ఉద్దేశం ప్రజా ప్రయోజనాలే అయి ఉండాలి. ఇతర జనాకర్షక పథకాలు ఎలా ఉన్నా, కేసీఆర్ తాజాగా ప్రవేశపెట్టిన రైతుబంధు మాత్రం రైతులకు ప్రయోజనకరమైందనే అభిప్రాయమే సర్వత్రా వ్యక్తమౌతోంది. దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వమూ చేయనంతగా, వ్యవసాయ పెట్టుబడులు అందించాలనే ఆలోచన చేసింది. అయితే, ఈ పథకంపై సహజంగా విపక్ష కాంగ్రెస్ పార్టీ కొన్ని విమర్శలు చేస్తుంది. ఈ పథకంలో కౌలుదారుల పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉంది. అంటే, భూ యజమాని ఎక్కడో ఏ హైదరాబాద్ లాంటి నగరంలో స్థిరపడి ఉంటాడు. కానీ, సొంత గ్రామంలో తనకు ఉన్న భూమిని కౌలుకి ఇచ్చి ఉంటాడు. ఇప్పుడీ పథకం ద్వారా అందే పెట్టుబడి సొమ్ము… యజమానికే వెళ్తుంది. మరి, క్షేత్రస్థాయిలో ఆ పొలం దున్నుతుండే కౌలు రైతు పరిస్థితి ఏంటనే ప్రశ్న వినిపిస్తోంది. రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని రైతు సంఘాలు చెబుతున్నాయి.
ప్రతీయేటా కౌలు చెల్లించి, పెట్టుబడి సమకూర్చుని వ్యవసాయం చేయడం కష్టమౌతోందనీ, అలాంటి వారి గురించి ఈ ప్రభుత్వం ఆలోచించలేదనీ, వారిని నిట్ట నిలువునా ముంచేసిందని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ప్రజల సొమ్ము ప్రజలకు ఇవ్వడాన్ని కూడా రైతులకు చేస్తున్న మెహర్బానీగా కేసీఆర్ చెబుతున్నారంటూ కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి మండిపడ్డారు. రైతుబంధు పథకం పూర్తిగా ఎన్నికల స్టంట్ అంటూ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు.
ఇక, చెక్కుల పంపిణీ కార్యక్రమంలో స్థానికంగా ఉండే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ ప్రకారం దక్కాల్సిన గౌరవం కూడా దక్కడం లేదని మాజీ మంత్రి డీకే అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. తన నియోజక వర్గంలో జరిగిన కార్యక్రమానికి తనను పిలవలేదనీ, వేదిక మీద కనీసం తన ఫొటోని కూడా పెట్టనివ్వలేదనీ, ఇదేదో తెరాస సొంత కార్యక్రమంగా నిర్వహిస్తున్నారని ఆమె మండిపడ్డారు. తెరాస నాయకుల ఇళ్ల నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇవ్వడం లేదనీ, పంచుతున్న డబ్బులు కేసీఆర్ అబ్బ సొత్తు కాదని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు.
చెక్కుల పంపిణీకి ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేలను పిలవడం లేదనేది కాంగ్రెస్ ఆవేదన. అధికార పార్టీ ఏదైనా సరే, ఇలాంటి కార్యక్రమాలకు ప్రతిపక్ష నేతల్ని ఆహ్వానిస్తుందని ఎవ్వరూ అనుకోరు. ఇక్కడ వారి క్రెడిట్ వారికి దక్కాలి కదా.
ఇక, కాంగ్రెస్ లేవనెత్తిన అంశాల్లో కౌలు రైతుల పరిస్థితి ఏంటనేది నిజంగానే చర్చించాల్సిన అంశమే. ఎందుకంటే, రైతుబంధు ద్వారా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కౌలు రైతులకు జరుగుతున్న మేలు ఏంటనే ప్రశ్న ప్రశ్నగానే ఉంది. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తోంది.