ఒక వ్యక్తి చెరువు గట్టుపై కూర్చుని ఉన్నాడు. అతనికి ఆకలవుతోంది. ఓ వ్యక్తి వచ్చాడు అతనికి ఆకలి తీర్చి వెళ్లాడు. ఆకలి తీరిందని… ఆ వ్యక్తి చెరువు గట్టుపైనే పడుకున్నాడు. మళ్లీ సాయంత్రానికి ఆకలయింది. మరో వ్యక్తి వచ్చాడు… ఈ సారి ఆ వ్యక్తి అతనికి కడుపు నింపలేదు. ఓ వల ఇచ్చాడు. చేపలు పట్టుకుని కాల్చుకుని తినమని సలహా ఇచ్చాడు. ఆకలితో అలమటించే అతను.. కష్టపడి చేపలు పట్టుకుని కాల్చుకుని తిన్నాడు. ఇక ఎవరి కోసమూ.. ఎదురు చూడాల్సిన అవసరం అతనికి లేదు. ఇక ఆకలయినప్పుడు చేపలు పట్టుకుని తింటాడు… ఈ పిట్ట కథలో.. ఎవరు గొప్ప..? ఒక్క పూట ఆకలి తీర్చినోడా.? జీవితాంతం ఆకలి తీర్చే మార్గం చూపించినోడా..?. ఇక్కడ ఇద్దరూ మంచోళ్లే. కానీ రెండో వ్యక్తి తలరాతను మార్చేసిన వ్యక్తి. తెలంగాణలో.. రైతాంగానికి ఎకరానికి రూ. 4 వేలు ఇస్తున్న కేసీఆర్ ఏ కోవలోకి వస్తారు…? కచ్చితంగా రెండో కోవలోకి అయితే రారు. మొదటి కోవలోని వ్యక్తే కేసీఆర్. కేసీఆర్ రైతు బంధు పథకం వల్ల.. రైతులకు ఒరిగేదేముంటుంది? . తాత్కాలికంగా.. ఎకరానికి రూ. 4వేలు రైతు చేతులో పెట్టడం తప్ప.
నిజానికి రైతులకు మేలు చేయాలంటే…. ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు తీసుకురావొచ్చు. కేసీఆర్ ఎకరానికి రూ. 4వేల చొప్పున ఇచ్చేందుకు రూ. ఆరు వేల కోట్ల వ్యయం చేస్తున్నట్లు చెబుతున్నారు. నిజానికి తెలంగాణలో పండే పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చేందుకు … రైతుల అసంతృప్తి చల్లార్చేందుకు ఏడాదికి ఈ మొత్తం సరిపోతాయి. మిర్చి సీజన్లో కానీ… మక్కల సీజన్లో కానీ.. మరో పంట విషయంలో కానీ… ఏ రైతుకీ మద్దతు ధర అందడం లేదు. అది మాత్రం నిజం. రైతుల్లో ప్రధానంగా అసంతృప్తి వ్యక్తమయ్యేది దీని గురించే. అలాగే.. ప్రకృతి వైపరీత్యాల సమయంలో…సర్వం కోల్పోయినా.. ప్రభుత్వాలు స్పందించేది అంతంతమాత్రమే. బీమా సంస్థలు రైతుల పేర్లు చెప్పి వందల కోట్లు ప్రీమియంగా ప్రభుత్వాల దగ్గర వసూలు చేస్తాయి కానీ తిరిగిచ్చేది కొంతే. ఇలాంటి సమయాల్లో రైతులను ఆదుకుంటే… వాళ్లకు ఉచితంగా ఇచ్చినట్లు కాకుండా… వాళ్ల బతుకుల్ని మెరుగుపర్చినట్లు ఉటుంది. ఇది … రైతుల బతుకుల్ని మూలల నుంచి బాగు చేయడం అవుతుంది.
కానీ కేసీఆర్… రైతుకు రూ. 4వేల పెట్టుబడి సాయం ఇచ్చేసి.. బాధ్యత తీరిపోయిందని.. రైతుల్ని ఆదుకుంటున్నామని ప్రచారం చేసుకుంటున్నారు. దీని వల్ల రైతులకు లాభం లేదని చెప్పలేము కానీ… రైతుల స్థితిగతుల్ని మార్చడానికి మాత్రం ఈ పథకం సమంజసం కాదు. ఏదైనా ఉచితంగా వస్తుందంటే.. దాని విలువ అనూహ్యంగా పడిపోతుంది. కష్టపడి సాధించుకున్నదానికే విలువ ఉంటుంది. అలాగే రైతులు.. ఆరుగాలం కష్టపడి శ్రమించి పండించుకున్నదానికి..గిట్టుబాటు అయ్యేలా ధరలు స్థిరీకరించాలి. ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోతే అండగా ఉండాలి. అప్పుడే.. రైతుల జీవితాలు బాగుపడే మార్గంలోకి వెళ్తారు. రూ. 4వేలు ఇచ్చినంత మాత్రాన… వెలుగులోకిరావు.
రాజకీయంగా కేసీఆర్ నిర్ణయం సూపర్. పైన చెప్పినట్లు…మద్దతుధరలు ఇప్పిస్తేనో… ప్రకృతి వైపరీత్యాలప్పుడు ఆదుకుంటేనో.. రైతులు ప్రభుత్వాన్ని గుర్తుంచుకుని ఓట్లేస్తారన్న గ్యారంటీ లేదు కాబట్టి.. కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారనుకోవచ్చు.