‘మహానటి’గా సావిత్రి బయోపిక్‌కి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఓ కథానాయిక జీవితాన్ని ఎలా చెప్పాలో, ఎలా చెబితే జనం చూస్తారో చెప్పడానికి ‘మహానటి’ ఉదాహరణగా నిలిచింది. ఈ స్ఫూర్తితో మరిన్ని బయోపిక్‌లు మన ముందుకొచ్చే అవకాశాలున్నాయి. అందరికంటే ముందు శ్రీదేవి బయోపిక్ పలకరించవచ్చు. ఇప్పటికే.. బోనీకపూర్ ఈ సినిమాకి సంబంధించిన కసరత్తులు మొదలెట్టినట్టు సమాచారం. కొన్ని టైటిళ్లు కూడా రిజిస్టర్ చేసి పెట్టుకున్నాడు. స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. 2019లో ఈ సినిమాని మొదలెట్టే అవకాశాలున్నాయి. అయితే.. శ్రీదేవి పాత్రలో ఎవరు కనిపించనున్నారు అనేదే ప్రధాన ప్రశ్న. ఇప్పుడు తమన్నా ‘శ్రీదేవి పాత్ర నేను చేయడానికి సిద్ధం’ అంటోంది. శ్రీదేవి కథానాయికగా నటించిన `హిమ్మత్వాలా`ని రీమేక్ చేసినప్పుడు ఆ పాత్ర శ్రీదేవికే దక్కింది. ప్రచార చిత్రాల్లో తమన్నాని చూసి ‘జూనియర్ శ్రీదేవి’ అంటూ హిందీ వాళ్లు కితాబులు ఇచ్చారు. అయితే ఆ సినిమా ఫ్లాపై తమన్నా ఆశలపై నీళ్లు చల్లింది. ఇప్పుడు ‘శ్రీదేవి’ బయోపిక్ తమన్నాకి మరో గొప్ప అవకాశం. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమాని విడుదల చేయనున్నారు. మూడు చోట్లా తెలిసిన కథానాయికనే తీసుకోవాలన్నది బోనీ ఆలోచన. ఆ లెక్కన ఆలోచిస్తే తమన్నాకు మంచి ఛాన్సే ఉంది. కానీ బోనీ మదిలో శ్రీదేవిగా ఎవరు మెదులుతున్నారో..?