తెలుగులో `మహానటి`కి బ్రహ్మరథం పడుతున్నారు. ప్రేక్షకులు, విమర్శకులూ… ఈసినిమాని నెత్తిమీద పెట్టుకుంటున్నారు. తమిళంలోనూ శుక్రవారం ఈ సినిమా విడుదలైంది. అయితే అక్కడ జెమిని గణేశన్ ఎఫెక్ట్ పడుతుందేమో అనుకున్నారంతా. జెమినీ గణేశన్‌ని దాదాపుగా విలన్‌గా చూపించిన సినిమా ఇది. అక్కడ జెమినీ అభిమానులు ఈ సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారో అని భయపడ్డారు. కానీ ఇప్పుడు ఆ భయాలు తొలగిపోయాయి. తమిళంలోనూ మహానటికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. రివ్యూలు కూడా అదిరిపోయాయి. సావిత్రి జీవితంలో ఏం జరిగిందో, సావిత్రి పతనానికి శివాజీ ఎంత వరకూ కారణమో అక్కడి జనాలకు బాగా తెలుసు. వాళ్లు సినిమాని సినిమాగానే తీసుకున్నారు. కాబట్టి.. మహానటికి అక్కడ కూడా అడ్డు లేకుండా పోయింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదలైంది. మూడూ కలిపి దాదాపుగా రూ.50 కోట్ల వరకూ వసూలు చేస్తుందన్నది చిత్రసీమ అంచనా.