ముస్లింలకు పది శాతం రిజర్వేషన్లు ఇస్తే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే తప్పేమిటనేది జగన్ వాదన. జగన్ ఈ మాట ఇప్పుడన్నారా.. గతంలో అన్నారా అన్న సంగతి పక్కన పెడితే… వైసీపీ నేతలు.. ప్రీ ప్లాన్డ్గా దీన్ని ప్రజల్లోకి చొప్పిస్తున్నారు. ప్రజల స్పందనను తెలుసుకుంటున్నారు. బీజేపీతో వైసీపీ పొత్తుకు సిద్ధం అవుతోందన్న అర్థం వచ్చేలా ఈ వ్యవహారం ఉండటంతో.. వైసీపీ వాళ్ల కన్నా.. టీడీపీ కార్యకర్తలే … వీటిని ఎక్కువగా ప్రజల్లోకి తీసుకుపోతున్నారు. దీనికి వస్తున్న స్పందనను.. వైసీపీ అగ్రనాయకత్వం ప్రస్తుతం విశ్లేషణ చేసుకుంటోంది. కానీ ఇప్పుడు వైసీపీకి ప్రత్యామ్నాయం లేదు. బీజేపీతో జోడి కట్టడమే మిగిలింది. అయితే ప్రస్తుతం బీజేపీ ఏపీలో మైనస్ ఫ్యాక్టర్. కావాలని పొత్తు పెట్టుకుంటే.. ఉన్న గోచి ఊడగొట్టుకున్నట్లే. అందుకే ఎన్నికలకు ముందా..? ఎన్నికల తర్వాతా అన్నదానిపై వైసీపీలో సందిగ్ధం నెలకొంది. వైసీపీ ప్రధాన ఓటు బ్యాంకులో ముస్లింలు ముఖ్యం. వీరికి పది శాతం రిజర్వేషన్లు ఆశ చూపిస్తే… బీజేపీతో పొత్తు పెట్టుకున్నా.. తమతో ఉంటారనుకుంటే… వైసీపీ ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉంది.
నిజానికి వైసీపీ ఎన్నికల తర్వాత పొత్తులే బెటర్ అనుకుంటోంది. కానీ బీజేపీ ఎందుకు వదిలిపెడుతుంది…? ఎన్నికల సమయంలోనే పొత్తులకు అంగీకరించాలని ఒత్తిడి చేస్తుంది. పొత్తుల్లేకుండా ఎన్నికలకు వెళ్తే.. జగన్ పై ఉన్న కేసుల అవసరాల కోసం…. ఏ కూటమి అధికారంలోకి వస్తుందనుకుంటే.. ఆ కూటమి వైపు వెళ్తారు కానీ… కచ్చితంగా ఎన్డీఏలోకే వస్తారని లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో.. బీజేపీకి మిత్రపక్షాలు చాలా అవసరం. రెండు అంకెల సీట్లు సాధించే మిత్రపక్షాలేమీ కూటమిలో లేవు. పైగా… .. జగన్ రెడీగా ఉన్నారన్న ఉద్దేశంతోనే … బీజేపీ టీడీపీని లైట్ తీసుకుంది. హామీలేమీ నెరవేర్చకపోతే… టీడీపీపై కోపం పెరిగి.. అంతిమంగా ప్రత్యామ్నాయంగా వైసీపీకే లాభిస్తుందని… వైసీపీకివస్తే బీజేపీకి వచ్చినట్లే అని నమ్మకం కలిగించారు వైసీపీ నేతలు. దాని ప్రభావమే ప్రస్తుత రాజకీయ పరిణామాలు. ఇంత చేసిన తర్వాత పొత్తు వద్దని వైసీపీ అంటే.. క్లైమాక్స్ సీబీఐ కోర్టు దగ్గరే జరుగుతుందన్న హెచ్చరికలు.. బీజేపీ వైపు నుంచి వచ్చే అవకాశం ఉంది.
పార్లమెంట్ సమావేశాలు కావొచ్చు… కర్ణాటక ఎన్నికలు కావొచ్చు.. విజయసాయిరెడ్డి పీఎంవోలో ప్రముఖ వ్యక్తిగా మారడం కావొచ్చు… ఈ వ్యవహారాలన్నింటితో.. ఇప్పుడు ప్రజలు … బీజేపీ, వైసీపీ మిత్రపక్షాలు కాదని అనుకోవడం లేదు. అధికారిక ప్రకటన లేదని మాత్రమే అనుకుంటున్నారు. ఇంతగా బంధం ప్రజల ముందు పడిపోయిన తర్వాత… విడివిడిగా ఎన్నికలకు వెళ్లినా ఏమి ప్రయోజనం ఉండదు. అందుకే వైసీపీ నేతలు.. ముందస్తుగా ఓటు బ్యాంకును బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. పది శాతం రిజర్వేషన్లు లాంటి తాయిలాలను జనంలోకి వదులుతున్నారు.