ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై భాజపా ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. భాజపాపై దాడులు జరుగుతుంటే ఆయన నిర్లిప్త వైఖరితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తిరుమలకు వస్తే… దర్శనం కోసం అన్ని ఏర్పాట్లు చేశామనీ, దర్శనం అయ్యాక దాడులకు కూడా తామే ఏర్పాట్లు చేశామని చెప్తున్నట్టుగా సీఎం వ్యవహార శైలి ఉందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి సమక్షంలోనే ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రధానిని దుర్భాషలాడితే ఎందుకు కేసులు పెట్టలేదన్నారు. అమిత్ షాపై దాడికి పాల్పడ్డ కార్యకర్తలపై చర్యలు లేవనీ, కేసులు ఎందుకు నమోదు చేయలేదని సోము వీర్రాజు ప్రశ్నించారు. చిత్తూరు, అనంతపురం, రాజమండ్రి… ఇలా భాజపాపై దాడులు జరుగుతుంటే స్పందించకపోవడం ద్వారా ఇస్తున్న సందేశం ఏంటన్నట్టు అని ప్రశ్నించారు.
ప్రజల్లో లేని ఉద్యమాన్ని రగిలించేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారన్నారు. ఆంధ్రాకి కేంద్రం చాలా చేసిందనీ, ఇప్పటికే కొన్ని యూనివర్శిటీలు ఇచ్చిందనీ, కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా నిధులు వస్తున్నాయనీ, ఇన్ని చేస్తున్నప్పుడు… ప్రత్యేక ప్యాకేజీ ద్వారా నిధులను కేంద్రం ఇవ్వదని ఎందుకు అనుకుంటున్నారు అని వీర్రాజు ప్రశ్నించారు..? స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసి, నిధులను ఎలా వాడతారో చెప్పమంటే ఇంతవరకూ చంద్రబాబు ఎందుకు స్పందించలేదన్నారు. ఆంధ్రాకి చేయాల్సినవన్నీ చేస్తున్నా… ఇవ్వాల్సినవి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా కూడా తమపై ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారన్నారు..? భాజపాపై నిరసన వ్యక్తం చేసే నైతిక హక్కు తెలుగుదేశం పార్టీకి లేదని సోము వీర్రాజు చెప్పారు. ప్రజలకు రక్షణలేని రాష్ట్రంలో మరోసారి టీడీపీకి ఎందుకు ఓటెయ్యాలని ప్రశ్నించారు? చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే బేషరతుగా అమిత్ షాకి క్షమాపణలు చెప్పాలన్నారు దాడికి బాధ్యులైనవారిపై వెంటనే చర్యలకు ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నా అన్నారు.
అంతా బాగానే ఉందిగానీ… ఆంధ్రాలో ఉద్యమం లేదనీ, ప్రజల ఆకాంక్షలు అంత తీవ్రంగా లేవని సోము వీర్రాజు చెప్పడం విడ్డూరంగా ఉంది! నిజానికి, తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నెత్తినేసుకోవడానికి కారణం ప్రజల ఆకాంక్ష తీవ్రతే కదా. భాజపాతో వైరం పెట్టుకుని, ఎన్డీయేతో బంధం తెంచుకోవడానికి కారణం కూడా ప్రజల ఆకాంక్షల ప్రోత్సాహమే కదా. ఇంకోటి… వీర్రాజు మాట్లాడుతూ ప్యాకేజీ నిధులు ఇస్తామని చెప్పినా టీడీపీ తీసుకోలేకపోయిందన్నారు! ఇస్తామన్న మాట ఎప్పుడు చెప్పారూ…. ప్యాకేజీ ప్రకటించి, రెండేళ్లు గడిచినా మౌనంగా ఉండిపోయి, కేంద్రం నుంచి రూపాయి కూడా విదల్చకుండా ఉంటే, ఏపీ ప్రజల్లో అసంతృప్తి మొదలయ్యాక చెప్పిన కబుర్లు అవి. సోము వీర్రాజు ఇవాళ్ల చెబుతున్నంత చిత్తశుద్ధి భాజపాకి ఉంటే… ప్యాకేజీ ప్రకటించిన వెంటనే ఎందుకు నిధులు విడుదల చేయలేదు..? ఇక్కడ గమనించాల్సిన మరో కోణం… అమిత్ షాకి నిరసన తెలిపిన తిరుమల ఘటనని రాష్ట్రంలోని శాంతిభద్రతలు సరిగాలేవన్నంత స్థాయి ప్రొజెక్షన్ ఇచ్చేందుకు భాజపా ప్రయత్నిస్తూ ఉండటం.