తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉపఎన్నికలు రావడం ఖాయమని.. ఘంటాపథంగా చెబుతున్నారు. ఆయన క్యాడర్‌ను కూడా రెడీ చేసేశారు. తెలుగుదేశం పార్టీ… ఇప్పటికే.. ఐదు నియోజకవర్గాల్లో రెండు, మూడు రౌండ్ల సర్వేలు పూర్తి చేసి.. అంశాల వారీగా… ఏం చేస్తే… తిరుగులేని విజయాలను నమోదు చేయవచ్చో పాయింట్లను రెడీ చేసుకుంది. ఇక వైసీపీ కూడా… తమ సిట్టింగ్ సీట్లే కాబట్టి.. పైగా హోదా కోసం తాము త్యాగం చేశాము కాబట్టి… ఆ ఒక్క అంశంతోనే మళ్లీ తమను గెలిపిస్తారని ఆశ పడుతున్నారు. ఈ రెండు పార్టీల సంగతి సరే..! మరి జనసేన పరిస్థితి ఏమిటి…?
జనసేన అధినేత పవన్ కల్యాణ్… ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉత్సాహంగా ఉన్నారు. నాలుగేళ్ల కిందట పార్టీ పెట్టినా.. ఇంత వరకు.. ఒక్క ఎన్నికలోనూ ప్రత్యక్షంగా పోటీ చేయలేదు. కానీ నాలుగో ఆవిర్బావ దినోత్సవసభలో మాత్రం త్వరలో ఏపీలో జరగబోయే పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అభ్యర్థుల్ని నిలబెడతానని ప్రకటించారు. సత్తా చూపుతానని కూడా విశ్వాసం ప్రకటించారు. వాటికంటే ముందు ఇప్పుడు అతి పెద్ద పరీక్ష పవన్ కల్యాణ్‌కు లోక్ సభ ఉపఎన్నికల రూపంలో ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మొదటగా నిర్ణయం తీసుకోవాల్సింది.. పోటీ చేయాలా వద్దా అని…! పంచాయతీ ఎన్నికల్లోనే పోటీ చేస్తామని ఘనంగా పవన్ ప్రకటించినందున… వెనక్కి పోలేని పరిస్థితి. ముందడుగు వేస్తే… బలమైన అభ్యర్థులు కావాలి. ఇప్పటి వరకూ అలాంటి నేతలెవరూ జనసేనలో లేరు. పార్టీ నిర్మాణం లేదు ఓటు బ్యాంక్‌ను పోలరైజ్ చేసుకోలేదు. ఇన్ని సమస్యల మధ్య… పవన్ కల్యాణ్… ముందుకే వెళితే… సానుకూల ఫలితాల్ని ఆశించలేరు. ఎందుకంటే… పోటీ ఐదు లోక్ సభ సీట్లలో టీడీపీ- వైసీపీ మధ్యే ఉంటుంది. జనసేన ఓట్ల చీలికకే పరిమితమవుతుంది. ఆ ఓట్లు ఏ స్థాయిలో చీలుస్తుందనేది జనసేన భవిష్యత్‌పై ప్రభావం చూపిస్తుంది. గెలుపోటముల్ని ప్రభావితం చేయగిలితే.. పవన్‌కు ఎదురుండదు. కానీ… సాదాసీదాగా ఓట్లు తెచ్చుకుంటే… ఫ్యాన్స్ కూడా ఇక పార్టీని పట్టించుకోరు.
రాజకీయాల్లో ఏ నిర్ణయమూ వంద శాతం ఫలితాలను ఇవ్వదు. సాధ్యమైనంత ఎక్కువ సక్సెస్ పర్సంటేజీ చూసుకుని నిర్ణయాలు తీసుకోవాలి. ఈ విషయంలోనూ పవన్‌పై చాలా తక్కువ స్థాయిలో అంచనాలున్నాయి. పవన్ ఏ నిర్ణయం తీసుకుంటారనేదానిపై ఫ్యాన్స్ కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.