ఇటీవల దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా ఫిల్మ్ చాంబర్ ఆవరణలో దాసరి విగ్రహాన్ని ప్రతిష్టించిన సంగతి తెలిసిందే. ఆ రోజు… ‘డైరెక్టర్స్ డే’ అని ప్రకటించి దాసరికి ఘన నివాళి ఇచ్చే ప్రయత్నం చేసింది చిత్రసీమ. అయితే ఈ కార్యక్రమం జరిగిన తీరుపైన, దాసరి విగ్రహం విషయంలోనూ మోహన్‌బాబు కాస్త గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. ఫిల్మ్ ఛాంబర్ ఆవరణలో ప్రతిష్టించిన దాసరి విగ్రహం మట్టితో తయారు చేసినది. `అంత గొప్ప వ్యక్తికి కాంస్య విగ్రహం చేయించాలి గానీ, ఈ మట్టి విగ్రహం ఎందుకు?` అంటూ తన సన్నిహితుల దగ్గర మండిపడ్డారట మోహన్ బాబు. ”నన్ను అడిగితే డబ్బులు ఇద్దును కదా. నన్ను సంప్రదించకుండా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశార”ని మోహన్‌బాబు ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దాసరి విగ్రహం ఏర్పాటు చేసిన సమయంలో మోహన్‌బాబు ఇండియాలో లేరు. ఆపరేషన్ నిమిత్తమై అమెరికా వెళ్లారు. తిరిగొచ్చాక విగ్రహం గురించీ, ఆ కార్యక్రమం జరిగిన తీరు గురించీ తెలుసుకున్న మోహన్‌బాబు తన అసంతృప్తి వెళ్లగక్కినట్టు తెలుస్తోంది. దాసరి విగ్రహం ప్రతిష్టించి ఇంకా పది హేను రోజులు కూడా కాలేదు. అప్పుడే ఈ విగ్రహం రంగు వెలిసిపోవడం మొదలైందని తెలుస్తోంది. ‘గురువు గారికి ఇచ్చే గౌరవం ఇదేనా’ అంటూ దాసరి ప్రియ శిష్యుడు మోహన్‌బాబు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.