ఎన్టీఆర్‌పై బయోపిక్ తీస్తానని నందమూరి బాలకృష్ణ చెప్పగానే.. రాంగోపాల్ వర్మ కూడా ‘నేను సైతం’ అంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చేశాడు. లక్ష్మీపార్వతి కోణంలోంచి ఎన్టీఆర్ కథని సినిమాగా తీస్తానని ప్రకటించాడు. పోస్టర్లూ బయటకు వదిలాడు. ఎన్టీఆర్ బయోపిక్‌తో పోటీగా, ఆ మాటకొస్తే ఎన్టీఆర్ బయోపిక్ రావడం కంటే ముందుగానే ఈసినిమాని విడుదల చేయాలని వీర లెవిల్లో ప్లాన్ చేశాడు. కానీ ఎందుకో… ఆ సినిమా పక్కకు వెళ్లిపోయింది. నాగార్జున డేట్లు ఇవ్వడంతో `ఆఫీసర్` పనిలో పడిపోయాడు. కాకపోతే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్.. తీస్తా.. తీస్తా’ అంటూ ఊరిస్తూ వచ్చాడు. ఈ సినిమా ఇప్పుడు చేయడం లేదంటూ వర్మ చేతులెత్తేశాడు. కొన్ని అనివార్య కారణాల వల్ల, ఈక్వేషన్స్ వల్ల ఈ సినిమా చేయడం లేదని వర్మ చెబుతున్నాడు. ఆ అనివార్య కారణాలేంటో మాత్రం చెప్పడం లేదు. ఎన్టీఆర్ సానుభూతి పరులు, ఎన్టీఆర్ వీరాభిమానులు, కొంతమంది కుటుంబ సభ్యులు వర్మని ఈ సినిమా తీయొద్దని బెదిరించారని వినికిడి. వర్మ బెదిరింపులకు భయపడే రకం కాదు. దాన్ని కూడా పబ్లిసిటీ రూపంలో వాడేసుకుంటాడు. అలాంటి వర్మ… ఇప్పుడు ఈ సినిమా పక్కన పెట్టేశా అని చెప్పడం కాస్త ఆశ్చర్యాన్ని, అనుమానాన్నీ కలిగిస్తోంది. వర్మకు సినిమాలు ప్రకటించడం, ఆ తరవాత వాటిని పక్కన పెట్టేయడం అలవాటైన విషయమే. కాకపోతే లక్ష్మీస్ ఎన్టీఆర్ విషయంలో మాత్రం వెనుకడుగు వేయడనిపించింది. ఈ దశలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ వర్మ ఈ నిర్ణయం తీసుకున్నాడు.