కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు… గత కొన్ని నెలలుగా జాతీయ రాజకీయాల్లో ఇదే తీవ్రమైన చర్చనీయాంశంగా నిలిచింది. ఈ ఫలితాలే 2019 లోక్ సభ ఎన్నికల్ని శాసిస్తాయన్న నమ్మకంతో భాజపా, కాంగ్రెస్ పార్టీలో హోరాహోరీగా తలపడ్డాయి. జాతీయ పార్టీల దిగ్గజ నేతలు ప్రచారం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, భాజపా అధ్యక్షుడు అమిత్ షా, రాహుల్ గాంధీ… ఇలా పనిగట్టుకుని కర్ణాటకలో సుడిగాలి పర్యటనలు నిర్వహించారు. దేశమంతా కర్ణాటకం వైపు చూస్తోందన్న పరిస్థితి కనిపించింది. కానీ, కర్ణాటకలో నమోదైన ఓటింగ్ శాతం చూస్తుంటే… అంత తీవ్రతను స్థానిక ప్రజలు ఫీలయ్యారా లేదా అనే అనుమానం కలుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 70 శాతం ఓటింగ్ నమోదు కావడం విశేషం. 2013 ఎన్నికలతో పోల్చితే ఇది తక్కువే. అప్పుడు 71.4 శాతం ఓటింగ్ జరిగింది. ఇక, బెంగళూరు నగరానికి వచ్చేసరికి… దాదాపు సగం మంది అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపలేదు.
ఇక, ఎగ్జిట్ పోల్ అంచనాల విషయానికొస్తే… ఎన్నికల ఫలితాలమై సందిగ్దత కొనసాగుతోందని చెప్పొచ్చు. ఎగ్జిట్ పోల్ అంచనాలు కూడా చాలావరకూ హంగ్ తప్పదనే చెబుతూ ఉండటం విశేషం. ఇండియా టుడే ఫలితాల ప్రకారం… కాంగ్రెస్ కి 106 నుంచి 118, భాజపాకి 79-92, జేడీఎస్ 22-30 వరకు వస్తాయని అంచనా వేసింది. టైమ్స్ నౌ ఎంవీఆర్ ఎగ్జిట్ పోల్ ప్రకారం… కాంగ్రెస్ కి 90-103, భాజపా 80-93, జేడీఎస్ 31-39, రిపబ్లికన్ జన్ కీ బాత్ అంచనా ప్రకారం… కాంగ్రెస్ 73-80, భాజపా 95-114, జేడీఎస్ 32-43. పీపుల్ పల్స్ ఎగ్జిట్ పోల్ ప్రకారమైతే.. కాంగ్రెస్ కి 90-109, భాజపాకి 80-93, జేడీఎస్ 31-39 స్థానాలు వస్తాయి. ఇండియా టీవీ అంచనా ప్రకారం.. కాంగ్రెస్ కి 97, భాజపాకి 87, జేడీస్ కి 35. ఇలా ప్రముఖ సంస్థల ఎగ్జిట్ పోల్ అంచనాల్లో ఎక్కువ శాతం హంగ్ వచ్చే అవకాశమున్నట్టే చెప్తున్నాయి. కాంగ్రెస్ అధికారం వస్తాయని చెబుతున్న సర్వేలు కూడా బొటాబొటీ మెజారిటీ మాత్రమే వస్తుందని అంచనా వేశాయి. జేడీఎస్ కి 30 నుంచి 40 స్థానాలు మాత్రమనే దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నది!
అయితే, రాష్ట్రవ్యాప్తంగా ఓటింగ్ శాతం కాస్త తక్కువగా నమోదు కావడం కచ్చితంగా చర్చించాల్సిన విషయమే. సహజంగా ఎక్కువ శాతం ఓటింగ్ నమోదు అయితే, అది ప్రతిపక్ష పార్టీలకు అనుకూలమైన ఫలితాలను ఇస్తుందంటారు. ఓటింగ్ శాతం తక్కువగా ఉంటే అది అధికార పార్టీకి అనువైన వాతావరణంగా చెబుతారు. దీని ప్రకారమే తమపై ప్రజా వ్యతిరేకత లేదు అనేది కాంగ్రెస్ నేతల అభిప్రాయం. తగ్గిన ఓటింగ్ శాతంపై భాజపా కూడా విశ్లేషణ చేసుకుంటోందన్నారు. బయట ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడ్డవారు ఎక్కువగా ఉన్నారు కాబట్టి, బెంగళూరులో ఓటింగ్ శాతం తగ్గిందనీ చెప్పుకోవచ్చు. దాదాపు 44 డిగ్రీల ఉష్ణోగ్రత ఈరోజు నమోదైంది కాబట్టి, చాలామంది పోలింగ్ బూతులకు రాలేదనీ అనుకోవచ్చు. ఇలాంటి కారణాలు ఎన్ని చెప్పుకున్నా… తగ్గిన ఓటింగ్ శాతాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది.
నాయకులు గమనించాల్సిన అంశం ఏంటంటే… బెంగళూరు లాంటి సిటీలో కూడా దాదాపు సగం జనాభా ఓటింగ్ ను ఎందుకు లైట్ గా తీసుకుంటున్నారన్నది ఆలోచించాలి. రాష్ట్రవ్యాప్తంగా చూసుకున్న అనూహ్యమైన ఓటింగ్ జరగలేదు. నాయకులందరూ అంతే అనే ఒక నిర్లిప్త వైఖరి ప్రజల్లో పెరుగుతోందా..? ఎవరికి ఓటేసినా పెద్దగా తేడా ఉండదనే అనే నైరాశ్యం ఎక్కువౌతోందా..? రాజకీయాలు తమకు పట్టని వ్యవహారం అన్నట్టు చూసేవారు పెరుగుతున్నారా.. అనే ప్రశ్నలు వేసుకోవాల్సిందే. ఏదైమైనా, కర్ణాటకలో ఎవరు అధికారంలోకి వస్తారనేది తెలియాలంటే మరో మూడు రోజులు వేచి చూడాల్సిందే.