ఆంధ్రప్రదేశ్ పర్యాటక మంతి అఖిలప్రియ… వివాహ నిశ్చితార్థం.. కుటుంబసభ్యుల మధ్య అత్యంత నిరాడంబరంగా జరుపుకున్నారు. తొలి వివాహం విఫలమవడం.. తనకు కాబోయే భర్తకు కూడా… రెండో వివాహం కావడం వల్లనేమో కానీ.. ఎక్కడా ఈ విషయాన్ని బహిరంగపర్చకుండా… ప్రైవేటుగా నిశ్చితార్థం పూర్తి చేసుకున్నారు. ఫోటోలను వారే మీడియాకు విడుదల చేశారో.. లేక వేరే విధంగా లీక్ అయ్యాయో తెలియదు కానీ… ఒక్కసారిగా ఆమె నిశ్చితార్థం ఆన్‌లైన్ లో వైరల్ అయిపోయింది. అప్పటి వరకూ.. గంట గంటకు కర్ణాటక పోలింగ్ పర్సంటేజీ ఎంతో లెక్కలు చూసుకున్న ఏపీలోని రెండు పార్టీల అభిమానులు కూడా కాసేపటికే .. దాన్ని మర్చిపోయి.. అఖిలప్రియ నిశ్చితార్థంపై పడ్డారు.
రకరకాల పోస్టులు, కామెంట్లు, వరుడెవరు… ఆయన బ్యాక్ గ్రౌండేమిటి… మొత్తం అప్పటికప్పుడు వెలికి తీసే పనిలో పడ్డారు. వీలైనంతగా… వ్యవహారాన్ని రాజకీయం చేసేశారు. మంత్రి నారాయణ అల్లుడికి తమ్ముడని ప్రచారం జరగడంతో… ఇక అడ్డే లేదనుకున్నారు. మాజీ డీజీపీకి మేనల్లుడు.. కాదు మాజీ అల్లుడని చర్చ పెట్టారు. చివరికి… నిశ్చితార్థానికి చంద్రబాబును ఎందుకు పిలువలేదని.. కోడిగుడ్డు మీద ఈకలు పీకడానికి కూడా కూహనా మేధావులు …కోడిబుర్ర పెద్దలు.. ఏ మాత్రం సంకోచించలేదు.
ఆమె మంత్రి కాబట్టి.. ఎలాగైనా విమర్శిస్తాం.. పబ్లిక్‌లోకి వస్తే ఏమైనా అంటాం… అని విప్లవ వాక్యాల్ని గుర్తు చేసుకుంటే అంత కన్నా భావదారిద్ర్యం ఏమీ ఉండదు. అఖిలప్రియ వ్యక్తిగత జీవితాన్ని ప్రజల ఎంటర్‌టెయిన్‌మెంట్ కోసం కేటాయించలేదు. ఆమెకు వ్యక్తిగత జీవితం ఉంటుంది. అందులో ఇష్టాలుంటాయి. కష్టాలుంటాయి. అన్నింటినీ రాజకీయం చేద్దామనుకోవడం మనుషుల లక్షణం కాదు. నిజానికి అఖిలప్రియ వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని కూడా ఆమె ధైర్యంగా ముందడుగు వేస్తున్నారు. అలాంటి వనిత వ్యక్తిగత జీవితాన్ని రాజకీయం చేయడం… సమాజానికి శోభనివ్వదు.