జి.హెచ్.ఎం.సి. ఎన్నికలకి ముందు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్ధి రోహిత్ ఆత్మహత్య కేసులో ఇద్దరు కేంద్ర మంత్రులు ఆరోపణలు ఎదుర్కొంటుండటంతో చాలా ఇబ్బందిపడుతున్న బీజేపీకి ఇప్పుడు మరో ఎదురుదెబ్బ తగిలింది. గ్రేటర్ ఎన్నికలలో తన అనుచరులకు పార్టీ టికెట్స్ ఇవ్వనందుకు నిరసనగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత మరియు మాజీ ఎమ్మెల్యే ప్రేమ సింగ్ రాధోడ్ ఈరోజు పార్టీకి రాజీనామా చేసారు. అనేక ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న తనకు ఏ మాత్రం గౌరవం ఇవ్వకుండా, పార్టీలోకి కొత్తగా వచ్చిన కాంగ్రెస్ వారికి గ్రేటర్ ఎన్నికలలో పోటీ చేయడానికి టికెట్స్ ఇవ్వడాన్ని ఆయన తప్పు పట్టారు. ఆయనని బుజ్జగించడానికి బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి తదితరులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. బహుశః తెరాస నుండి ఆఫర్ వచ్చినందునే ఆయన ఈ సాకుతో పార్టీ నుండి బయటకు వెళ్లిపోయారేమో? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.