భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తిరుమల రావడం, అక్కడ కొంతమంది ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేయడం, ఈ క్రమంలో కాన్వాయ్ మీదకు రాళ్లు రువ్వే ఘటన… ఇవన్నీ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. సరే, ఎవరిపైన అయినా ఇలాంటి దాడులు జరగడం మంచి సంస్కృతి అయితే కాదు. కాబట్టి, అందరూ దీన్ని ఖండించారు. అయితే, ఈ ఘటనపై కేంద్రం కంటే సాక్షి మీడియా మరింత తీవ్రంగా తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఘటన జరిగిన దగ్గర నుంచీ ప్రతీరోజూ ఏదో ఒక ఫాలో అప్ కథనాలు రాస్తోంది. తాజా కథనం ఏంటంటే… అమిత్ షా కాన్వాయ్ పై దాడిని కేంద్రం హోంశాఖ తీవ్రంగా పరిగణిస్తోందని! ఒక జాతీయ పార్టీ నాయకుడు వస్తున్నప్పుడు, ముందస్తు భద్రతా ఏర్పాట్లు తీసుకోకపోతే ఎలా అని స్థానిక అధికారులను ప్రశ్నించిందని రాశారు. ఈ నిరసన కార్యక్రమానికి నేతృత్వం వహించిన నాయకులు ఎవరనేది కూడా దర్యాప్తు చేస్తున్నారని రాశారు.
ఇక, నిన్నటి కథనాల విషయానికొస్తే… ఏపీ పోలీస్ వ్యవస్థలో డొల్లతనం బయటపడిందని రాశారు. ఇది చంద్రబాబు నేతృత్వంలో జరిగిన దాడిగా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయన్నారు. కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ గెలిస్తే… తనకు కష్టాలు తప్పవని చంద్రబాబు నాయుడు భీతిల్లుతున్నారనీ, తనపై ఉన్న అవినీతి ఆరోపణలపై కేంద్రం దర్యాప్తు మొదలుపెడుతుందో అని బెంబేలెత్తిపోతున్నారు అంటూ విశ్లేషణలు చేశారు. అమిత్ షాపై దాడి చేయించడం ద్వారా కర్ణాటకలో తెలుగువారిన భాజపాకి వ్యతిరేకంగా ఓట్లేయించాలన్నదే దీని వెనక ఉన్న వ్యూహమని సాక్షి మీడియా స్పష్టం చేసింది.
అంటే, కర్ణాటకలో భాజపా గెలిస్తే, తనపై ఉన్న అవినీతి ఆరోపణల దర్యాప్తును కేంద్రం ప్రారంభిస్తుందన్నది చంద్రబాబు భయం అన్నమాట! అంతే కదా! ఇంతకీ.. కర్ణాటకలో భాజపా గెలుపునకీ, చంద్రబాబుపై ఉన్న అవినీతి ఆరోపణలపై దర్యాప్తునకీ ఏంటి సంబంధం..? కన్నడనాట గెలిస్తే తప్ప, ఏపీ సీఎంపై చర్యలు తీసుకోకూడదన్న నియమం ఏదైనా భాజపా పెట్టుకుందని సాక్షికి తెలిసిందా..? ఒకవేళ ఏపీ సీఎంపై అవినీతి ఆరోపణలుంటే, వాటిపై దర్యాప్తునకు కేంద్రం ఎప్పుడైనా ఆదేశించొచ్చు కదా! దానికీ, కర్ణాటక ఫలితానికీ, అమిత్ షాపై దాడికీ… ఈ మూడింటికీ ఉన్న అవినాభావ సంబంధం ఎలా కుదురుతుంది అనేదే ప్రశ్న..? కానీ, ఈ మూడింటినీ ఒకే కోణంలో చూపించేందుకు సాక్షి ప్రయత్నం చేస్తోంది. అందుకేనేమో, తిరుమల ఘటనపై కేంద్రం కంటే తీవ్రంగా వీరు స్పందిస్తున్నట్టున్నారు.