అటు తిరిగీ ఇటు తిరిగీ.. అనూహ్యంగా కన్నా లక్ష్మీనారాయణను ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షుడిగా భాజపా నియమించిన సంగతి తెలిసిందే. నిజానికి, ఆ పదవి రేసులో చివరి ఆప్షన్ గా ఉంటూ వచ్చిన కన్నా పేరుకి భాజపా జాతీయ నాయకత్వం టిక్ పెట్టడం విశేషం! అధ్యక్ష పదవి రేసు నేపథ్యంలో ఏపీ నేతల మధ్య నెలకొన్న పోటీ వైఖరి, సోము వీర్రాజుకు ఇస్తే ఒప్పుకునేది లేదనీ, తప్పుకోవడం తప్పదంటూ ఆకుల సత్యనారాయణ హెచ్చరికలు, ఆయనకి వ్యతిరేకంగా కొంతమంది ఢిల్లీకి లేఖలు… వెరసి కన్నాకు అవకాశం రావడం వెనక, ఆయన అర్హత కంటే రాష్ట్రంలోని ప్రత్యేక పరిస్థితుల ప్రభావమే ఎక్కువ అనడంలో సందేహం లేదు. ఇక, రాష్ట్ర భాజపా కొత్త అధ్యక్షుడిగా కన్నాముందు రెండు ప్రధాన సవాళ్లున్నాయి.
మొదటిది ఇంటిపోరు..! తనకే అధ్యక్ష పదవి దక్కుతుందని సోము వీర్రాజు చాలా ఆశలు పెట్టేసుకున్నారు. ఆయనతోపాటు మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకి కూడా పదవి వస్తుందన్నారు. ఒక దశలో పురంధేశ్వరి పేరు కూడా వినిపించింది. అయితే, వీరంతా ఇప్పుడు కన్నాకు సహకరిస్తారా అనేది ప్రశ్న..? ఎందుకంటే, టీడీపీతో పొత్తులో ఉండగా, ఏపీ భాజపా నేతలుగా వీరంతా ‘తమకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ’ తరచూ ఢిల్లీ నాయకత్వానికి ఫిర్యాదు చేసేవారు. అప్పట్లో టీడీపీతో మంచి దోస్తీ ఉండేది కాబట్టి, ఆ ఫిర్యాదులను భాజపా అధిష్టానమూ పెద్దగా పట్టించుకోలేదు. కేంద్ర అవసరాలన్నింటినీ వయా వెంకయ్య నాయుడు ద్వారా చంద్రబాబు నాయుడు చక్కబెట్టుకునేవారు. రాష్ట్ర భాజపా నేతల్ని పెద్దగా పట్టించుకునేవారు కాదు! ఆ దశలో రాష్ట్రంలోని టీడీపీతో కొంత నిరసన వాతావరణాన్ని ఎదుర్కొంటూ, అధిష్టానం తమ గోడును పట్టించుకునే పరిస్థితి లేదన్న రీతిలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసేవారు. ఉనికి కోసం పోరాటం చేసేవారనడం కరెక్ట్. అలాంటి సమయంలో కూడా పార్టీకి అండగా నిలుస్తూ వచ్చిన తమను కాదని, పార్టీ వదిలి వెళ్లిపోయేందుకు సిద్ధమైన కన్నాకు అవకాశం ఇవ్వడంపై కొంత అసంతృప్తి వీరిలో కచ్చితంగా ఉంటుంది. ఇలాంటి వాతావరణం మధ్యలో కన్నా పనిచేయాల్సి ఉంటుంది.
ఇక, రెండోది రాష్ట్రంలో భాజపాపై ప్రజా వ్యతిరేకత. ఎన్డీయే నుంచి టీడీపీ విడిపోయాక కేంద్ర వాదనను కన్నా ఇంతవరకూ బలంగా వినిపించిన దాఖలాలు లేవు. సోము వీర్రాజు రేంజిలో టీడీపీపై విమర్శలూ చేయలేదు. ఇక, రాష్ట్ర అధ్యక్షుడిగా ఆ పని ఆయనకి తప్పదు. పైగా, రాష్ట్రంలో భాజపాపై తీవ్ర వ్యతిరేకత ఉందనేది వాస్తవం. ప్రత్యేకహోదా, విభజన హామీల విషయంలో ఆంధ్రాని భాజపా నిలువునా ముంచిందనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. దీంతో ఇతర పార్టీలు కూడా ఎన్నికల ముందు భాజపాతో పొత్తుకు భయపడుతున్న పరిస్థితి. ఇప్పుడు, పార్టీ అధ్యక్షుడిగా ప్రజా వ్యతిరేకతను కన్నా డీల్ చేయాల్సి ఉంటుంది. పార్టీలో ఉన్నప్పటికీ కన్నాను ఒక భాజపా నేతగానో, అడ్డగోలుగా కేంద్ర వాదనను రాష్ట్రంపై రుద్దే నాయకుడిగానో ప్రజలు చూడలేదు. ఇకపై, ఆ ముద్రను కూడా వేయించుకోవడానికి కన్నా సిద్ధంగా ఉండాలి. ఈ నేపథ్యంలో ఆంధ్రాలో అత్యంత ప్రతికూల పరిస్థితుల మధ్య భాజపాని విస్తరింపజేయడం అనేది కన్నా ముందున్న పెద్ద సవాల్.