నందమూరి తారకరామారావు నుంచి ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ వరకూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోలతో సినిమాలు నిర్మించిన సంస్థ వైజయంతి మూవీస్. భారీ బడ్జెట్ సినిమాలకు పెట్టింది పేరు ఈ సంస్థ. టాప్ హీరోలతో పలు హిట్ సినిమాలు నిర్మించిన వైజయంతి మూవీస్ అధినేత అశ్వనీదత్ ఏడేళ్లుగా చిత్ర నిర్మాణానికి దూరంగా వున్నారు. ఎన్టీఆర్ ‘శక్తి’ తరవాత మరో సినిమా నిర్మించలేదు. మధ్యలో ఆయన కుమార్తెలు స్మాల్ మీడియం బడ్జెట్ సినిమాలు నిర్మించారు. ‘శక్తి’ పరాజయంతో అశ్వనీదత్ సినిమాలు నిర్మించడం మానేశారని వార్తలు వచ్చాయి. జోతీష్యుడు చెప్పడంతో నిర్మాణానికి దూరంగా వున్నానని ఆయన పేర్కొన్నారు. తాజాగా విడుదలైన ‘మహానటి’తో వైజయంతి మూవీస్ మళ్ళీ వెలుగులోకి వచ్చింది. అలాగే, ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజుతో కలిసి ఓ సినిమా నిర్మిస్తున్నారు. ఆ తరవాత ఎన్టీఆర్ హీరోగా సినిమా వుంటుంది. హీరోతో డిస్కషన్స్ జరుగుతున్నాయి. “మహేష్ సినిమా తరవాత ఇమ్మీడియట్‌గా ఎన్టీఆర్‌తో సినిమా చేస్తాం. ఇద్దరు ముగ్గురు దర్శకులను అనుకుంటున్నాం. ఈ నెలాఖరుకు ఒకర్ని ఫైనలైజ్ చేస్తాం” అని అశ్వనీదత్ ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.