2004లో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న దివంగత వై.ఎస్. రాజశేఖర రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఊపు తీసుకొచ్చారు. ప్రస్తుతం జగన్ కూడా పాదయాత్రలో ఉన్నారు. ఇవాళ్ల 2000 కిలో మీటర్ల మైలు రాయికి చేరుతున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ పత్రిక ‘సాక్షి’ సమగ్రమైన కథనాలు ఇచ్చిందా అంటే.. లేదని అనిపిస్తోంది. వైయస్ అడుగు జాడల్లో జగన్ యాత్ర సాగిస్తున్నారని అంటున్నారే తప్ప, ఆ జాడలు ఏంటనేవి స్పష్టంగా ఇవాల్టి కథనాల్లో వివరించలేకపోయారు. 2004లో కూడా వైయస్సార్ పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లా మీదుగా సాగింది. ఈ సందర్భాన్ని ప్రముఖంగా ప్రచురించలేకపోయారు. నాటి రాజకీయ పరిస్థితులు, ఆ సందర్భంలో వైయస్ పాదయాత్రకు వచ్చిన స్పందనను గుర్తు చేయలేకపోయారు.
రాష్ట్రంలో 2003 నాటి పరిస్థితులే ఇప్పుడున్నాయని, నాడు వైయస్సార్ పాదయాత్రకు లభించిన స్పందనే నేడు జగన్ కీ వస్తోందని కొన్ని చోట్ల పేర్కొన్నారు. ఇడుపులపాయ నుంచి ఈరోజు వరకూ సాగిన జగన్ యాత్ర గురించి ప్రెజెంట్ చేశారు. కానీ, ఇదే క్రమంలో నాటి వైయస్సార్ యాత్రలోని కీలకాంశాలను కూడా గుర్తుచేయలేకపోయారు. నాడు వైయస్ పాదయాత్రను చూసినవారితో ఇంటర్వ్యూలుగానీ, నాటి యాత్రను కవర్ చేసిన పాత్రికేయులతో కాలమ్స్ గానీ రాయించలేకపోయారు.
ఒక పార్టీ పత్రికగా, ఆ పార్టీ అధినేత చేపట్టిన పాదయాత్ర కీలక దశకు చేరుకున్న తరుణాన్ని సాక్షి సమగ్రంగా వినియోగించుకోలేకపోయింది. తన ప్రసంగాల్లో రాజన్న రాజ్యం అంటూ జగన్ ప్రస్థావిస్తూ వస్తున్నారే తప్ప, దానికి బలం చేకూర్చే విధంగా, ప్రజల్లో సెంటిమెంట్ ను ఆకట్టుకునే తరహాలో సాక్షి కథనాలు ఉండటం లేదు. ఈరోజు మాత్రమే కాదు, పాదయాత్ర మొదలైన దగ్గర నుంచి కూడా చూసుకుంటే… సాక్షిది కేవలం ప్రేక్షక పాత్ర అన్నట్టుగానే కనిపిస్తోందనే విమర్శలు ఆ పార్టీ వర్గాల్లోనే కొంతమంది నుంచి వినిపించిన సందర్భాలున్నాయి. ఇక, 2004లో వైయస్సార్ పాదయాత్ర సందర్బంగా అప్పట్లో ‘ఈనాడు’ ఇచ్చిన కవరేజ్ చాలామందికి గుర్తుండే ఉంటుంది. అప్పట్లో వైయస్సార్ యాత్రకు ఈనాడు ఇచ్చిన ప్రాధాన్యత, ఇతర పత్రికలే ఏవీ ఇవ్వలేదని చెప్పొచ్చు. ఆ తరహాలోనే జగన్ పాదయాత్రను కూడా ప్రజలకు గుర్తిండిపోయేలా చేసేందుకు వారి సొంత పత్రిక సాక్షి పనితీరు ఉంటోందా అనేదే ప్రశ్న..?