కర్ణాటక ఎన్నికలు పూర్తవగానే ఆంధ్రప్రదేశ్ పై ప్రత్యేక దృష్టి పెడతామంటూ భాజపా నేతలు ఎప్పటికప్పుడు చెబుతూనే వస్తున్నారు. అన్నటుగానే కర్ణాటక పోలింగ్ అయిన మర్నాటి నుంచే యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టేశారు. హుటాహుటిన ఏపీ పార్టీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ నియామకం జరిగిపోయింది. దీంతో సంస్థాగతంగా పార్టీని బలోపేతం చర్యలు ఏపీలో అధికారికంగా ప్రారంభమైనట్టే..! ఇక, ‘ఆపరేషన్ ఆంధ్రా’లో అసలు అంశం… టీడీపీ సర్కారుపై ప్రత్యేక దృష్టి సారించడం. తాజాగా తిరుమలలో అమిత్ షాకి ఎదురైన అనుభవాన్ని కేంద్రం కాస్త సీరియస్ గానే తీసుకుంటోంది. దీంతోపాటు ఈ మధ్య ధర్మపోరాట దీక్షల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలపై కూడా దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తోంది.
ఏదో ఒక కీలకాంశంలో ఏపీ సర్కారు అవినీతి ఇదీ అంటూ నిరూపించే ప్రయత్నంలో కేంద్రం ఉందని సమాచారం! దీన్లో భాగంగా భాజపా దృష్టి పోలవరం ప్రాజెక్టుపై పడిందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఇప్పటికే బోలెడంత అవినీతి జరిగిందని రాష్ట్ర భాజపా నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కాబట్టి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై సీబీఐ ఎంక్వయిరీ వేచించే అవకాశం ఉందని భాజపా వర్గాల్లో గుసగుసలు వినిపిస్తూ ఉండటం గమనార్హం! ఈ దిశగా కేంద్రం వ్యూహరచన సాగుతోందనే విషయం టీడీపీ నేతలకు కూడా తెలుసు అని సమాచారం. అయితే, రాష్ట్ర వ్యవహారాలపై సీబీఐ ఎంక్వయిరీ వేయించాలంటే, ముందుగా కోర్టు అనుమతులు కావాల్సి వస్తుందని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. కానీ, పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి, నిర్మాణ బాధ్యతలు మాత్రమే రాష్ట్రం తీసుకుంది కాబట్టి, నేరుగా ఎలాంటి చర్యలైనా కేంద్రం తీసుకోవచ్చనేది భాజపా నేతల వాదనగా తెలుస్తోంది.
అంతేకాదు, సాంకేతికంగా కోర్టు నుంచి అనుమతి కావాల్సి వచ్చినా… ఆ లాంఛనం కూడా పూర్తి చేయాలనే ఆలోచనలో భాజపా కేంద్ర నాయకత్వం ఉన్నట్టు ఢిల్లీ వర్గాల ద్వారా తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రక్రియ ప్రారంభమౌతుందనీ, ఏపీ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేయాలన్న వ్యూహరచన జరుగుతోందని సమాచారం. నిజానికి, ఏపీలో రాజకీయ పరిణామాలు మార్చడానికి తమకు మూడు నెలలు మాత్రమే చాలంటూ ఈ మధ్యనే జీవీఎల్ నర్సింహారావు వ్యాఖ్యానించారు. భాజపా వేగం చూస్తుంటే… అదే పనిలో ఉన్నట్టున్నారని అనిపిస్తోంది.