రైతుబంధు పథకం రైతులందరికీ ఆత్మబంధువు కాలేకపోతోందన్న విమర్శలు విపక్షాలు చేస్తున్నాయి. నిజానికి, కౌలు రైతుల పరిస్థితి ఏంటనేది ఇప్పటికీ స్పష్టత లేకుండా ఉంది. ఈ పథకం ప్రకారం కరీఫ్, రబీ సీజన్లకు ఎకరాకి రూ. 8 వేల చొప్పున చెక్కుల పంపిణీ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోంది. అయితే, లక్షల సంఖ్యలో ఉన్న కౌలు రైతులకు ఈ పథకం ద్వారా అందే సాయం ఏమీ లేదనే విమర్శలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ అందిస్తున్న సాయం భూ యజమానులకే తప్ప, కౌలుదార్లకు వర్తించదు. ఈ సమస్యపై చాలా సులువైన పరిష్కార మార్గాన్ని మంత్రి కేటీఆర్ సూచించారు. కానీ, ఆయన సూచించినంత సులువుగా దాని అమలు సాధ్యమా అనేదే ప్రశ్న..?
ఈ అంశానికి చిన్న పొలిటికల్ టచ్ ఇస్తూ… కౌలు రైతులు, భూ యజమానుల మధ్య చిచ్చు పెట్టేందుకు విపక్షాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రైతుబంధు పథకం ద్వారా అందే సొమ్ముని భూయజమానులే కౌలురైతులకు ఇచ్చేస్తే బాగుంటుందన్నారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానించాలని కేంద్రాన్ని కోరినట్టు చెప్పారు. పంటల మద్దతు ధరను కూడా 25 శాతం పెంచాలని కోరుతున్నామన్నారు. రైతుబంధుపై విమర్శలు చేస్తున్న విపక్ష నేతలకు, ఈ పథకం వద్దు అని చెప్పేంత ధైర్యం ఉందా అంటూ సవాల్ చేశారు.
సరే, కేటీఆర్ సవాళ్లు, విమర్శల్ని పక్కనపెడితే.. రైతుబంధు ద్వారా కౌలురైతులకు ఎలా లబ్ధి చేకూరుతుందనే స్పష్టత ఇవ్వలేదు. కౌలుదారులకు భూయజమానులు సొమ్ము ఇచ్చేయమని సూచిస్తే … అమలు జరిగిపోతుందా..? ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఏదో ఒక స్పష్టమైన నిర్ణయం, ఆచరణ యోగ్యమైన పరిష్కారం అన్వేషించాలి కదా. కానీ, కౌలుదారుల అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటున్నట్టు కనిపించడం లేదు. గతంలో ఎప్పుడో వైయస్ హయాంలో కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చారు. అవి కూడా ఇప్పుడు పనిచేసే పరిస్థితి లేదు. ఇక, తెలంగాణ ఏర్పడ్డ తరువాత, తమది రైతు సంక్షేమ ప్రభుత్వం అని తెరాస చెప్పుకుంటూ ఉన్నా… కౌలు రైతులకు సంబంధించిన సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించలేదు. కనీసం ఈ రైతుబంధు పథకం అమల్లోకి వచ్చిన ఈ సందర్భంలోనైనా వారి ఇబ్బందులపై ప్రభుత్వం దృష్టిపెట్టేట్టు కనిపించడం లేదు. ఈ పథకం ద్వారా పెద్ద సంఖ్యలో రైతులకు మేలు జరుగుతుందన్నది వాస్తవమే. కానీ, చిన్న సంఖ్యలో ఉన్న కౌలురైతులకు తోడ్పాటు ఉండాలి కదా.