సార్వత్రిక ఎన్నికలకు దాదాపుగా అన్ని పార్టీలూ సిద్ధమైపోయిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఎన్నికల లక్ష్యంగానే ప్రధాన పార్టీల ప్రచారం సాగుతోంది. అయితే, దానికంటే ముందుగా వచ్చేనెలలో పల్లె ఎన్నికల నగారా మోగనుంది. వచ్చే నెలలో తెలంగాణ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న పాలక వర్గాల పదవీ కాలం జూలై నెలాఖరుకి ముగుస్తుంది. ఈలోగా కొత్త పాలక వర్గాలను కొలువుదీర్చాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే, ఎన్నికల ప్రక్రియను ఆగస్టు 1 కి కనీసం ఐదు వారాల ముందే ముగిసేలా ప్రయత్నిస్తోంది. ఎందుకంటే, ఎన్నికైన కొత్త పాలక వర్గాలకు ఐదు వారాల పాటు శిక్షణ ఇవ్వాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది.
వచ్చే నెల 6న ఎన్నికల ప్రకటన జారీ చేసి, అదే నెల 23 నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘ అధికారులతో, పంచాయతీరాజ్ అధికారులు సమావేశమై, ఎన్నికల నిర్వహణ తేదీలపై ప్రెజెంటేషన్ ఇచ్చినట్టు సమాచారం. కొత్తగా అమల్లోకి వచ్చిన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం.. నోటిఫికేషన్ వెలువడ్డ తరువాత 12వ రోజున పోలింగ్ తోపాటు, ఫలితాల వెల్లడి కూడా జరిగిపోవాలి. ఈ పన్నెండు రోజుల్లోపే ఇతర కార్యక్రమాలన్నీ పూర్తైపోవాలి. మొత్తానికి, జూన్ 23 నాటికి పంచాయతీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ అంతా పూర్తయిపోవాలన్నది సర్కారు ప్రతిపాదన. ఓ పదిహేను మినహా, రాష్ట్రవ్యాప్తంగా 12,751 పంచాయతీల పాలక వర్గాలకు జులై నెలాఖరుతో పదవీ కాలం ముగుస్తోంది. వచ్చే నెల 23 నాటికి కొత్త పాలక వర్గాల ఎన్నిక పూర్తి కావాలన్నది తెరాస సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది.
సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ పంచాయతీ ఎలక్షన్స్ ని కూడా ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగానే తీసుకుంటాయి. ఈ ఫలితాలను కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసుకునేందుకు వాడుకుంటాయి. తెరాస, కాంగ్రెస్ లతోపాటు టీడీపీ, టీ.జె.ఎస్.లు కూడా స్థానిక ఎన్నికలకు సిద్ధమైపోయి ఉన్నాయి. నిజానికి, పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువగా స్థానిక అంశాల ప్రాతిపదికనే ఓటింగ్ ఉంటుంది. కానీ, ప్రస్తుతం ఈ ప్రధాన పార్టీల ప్రిపరేషన్స్ చూస్తుంటే… పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులను కూడా రాష్ట్రస్థాయి నాయకత్వమే ఖరారు చేస్తుందేమో అన్నట్టుగా పరిస్థితి ఉంది!
ఇంకోటి… కొత్తగా కొలువైన పాలక వర్గాలకు ఐదు వారాల శిక్షణ ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఎన్నికలకు కొన్ని నెలల ముందున్న ఆ సమయంలో స్థానిక సంస్థలకు ప్రభుత్వం ఇవ్వాలనుకుంటున్న ఆ శిక్షణ మోడల్ ఏంటనేది కూడా కొంత ఆసక్తికరమైన అంశమే అవుతుంది కదా.