హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ ఆత్మహత్యకు కారణమైన సస్పెన్షన్‌పై వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఎట్టకేలకు స్పందించింది. సస్పెన్షన్‌కు గురైన రోహిత్ సహ విద్యార్థులు నలుగురిపై ఆ సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఇవాళ నిర్ణయం తీసుకుంది. ఆ నలుగురి పేర్లు ప్రశాంత్, శేషయ్య, విజయ్, సుంకన్న. తరగతులు, పరిశోధనలకు ఆటంకం కలగకుండా చూడాలని, సమస్యలేమైనా ఉంటే అంతర్గతంగా చర్చించుకుని పరిష్కరించుకుందామని వీసీ అప్పారావు పిలుపునిచ్చారు. వర్సిటీలో ప్రశాంతత నెలకొనటానికి సహకరించాలని అభ్యర్థించారు. అయితే, వీసీని తొలగించేవరకు, రోహిత్‌కు న్యాయం జరిగేవరకు ఆందోళన కొనసాగిస్తామని అతని సహచరులు చెప్పారు. ఈ నిర్ణయం పది రోజులముందు తీసుకుని ఉంటే ఒక ప్రాణం నిలిచి ఉండేదని అన్నారు. ఇప్పటివరకు, వివాదం కోర్టు పరిధిలో ఉన్నందున సస్పెన్షన్‌ను ఎత్తేయలేమని అప్పారావు చెబుతూ వస్తున్నారని, మరి ఇవాళ ఎందుకు ఎత్తేశారని ప్రశ్నించారు. మరోవైపు, వీసీ అప్పారావు తన కొడుకు చేసిన తప్పేమిటే చెప్పాలని రోహిత్ తల్లి రాధిక అన్నారు. రోహిత్ చనిపోయాక వీసీ అప్పారావు తనను కలుస్తానని ప్రయత్నించారని, ఏ తప్పూ చేయకపోతే ఆయన దొంగతనంగా తనను కలవటానికి వస్తానని ఎందుకంటున్నారని ప్రశ్నించారు. న్యాయంకోసం అవసరమైతే ఢిల్లీ వెళతానని చెప్పారు.