మహానటితో ఒక్కసారిగా నాగ్ అశ్విన్ `స్టార్` అయిపోయాడు. నాగ్ అశ్విన్ ఇప్పుడు ఎవరికి కథ చెబుతానన్నా.. అప్పాయింట్ మెంట్ ఇచ్చేయాల్సిందే. పైగా నాగ్ అశ్విన్ వెనుక వైజయంతీ మూవీస్ ఉంది. ఏ హీరోకైనా కథ చెప్పి, ఒప్పించి, మరుక్షణం సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లొచ్చు. కానీ నాగ్ అశ్విన్ మాత్రం ఎక్కడా తొందర పడడం లేదు. రిలాక్స్డ్గానే అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం `మహానటి` విజయాన్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తున్నాడు. తదుపరి సినిమా గురించి కూడా పెద్దగా ఆలోచించడం లేదు. కనీసం మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకుని అప్పుడు… కొత్త సినిమా పనులు మొదలెడతాడట. నాగ్ అశ్విన్ ది ముందు నుంచీ నిదానమైన ప్రయాణమే. `ఎవడే సుబ్రహ్మణ్యం` వచ్చిన రెండేళ్లకు గానీ `మహానటి` మొదలెట్టలేదు. ఇప్పుడు మరీ అంత టైమ్ తీసుకోకపోవొచ్చు గానీ, కంగారేం పడడు. ఇప్పటికే అశ్విన్‌తో సినిమా చేయడానికి చిరు ముందుకొచ్చాడు. ఈ స్క్రిప్టు తయారు చేయడానికి కనీసం యేడాది సమయం పడుతుంది. ఇక నుంచి అశ్విన్ కూడా చిరు స్క్రిప్టు పనుల్లోనే ఉండాలని తీర్మాణించుకున్నాడట. మధ్యలో ఎన్ని ఆఫర్లొచ్చినా పక్కన పెట్టాలని, చిరు స్క్రిప్టు పూర్తయిన తరవాతే మిగిలిన కథల గురించి ఆలోచించాలని భావిస్తున్నాడు. మరోవైపు నానితో కూడా ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు అశ్విన్. అయితే అందుకు సంబంధించిన కథలేవీ ఇంకా సిద్ధం కాలేదు. నాని కూడా తన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. అందుకే చిరు కథ పూర్తయ్యాకే మిగిలిన విషయాల జోలికి వెళ్లాలని నాగ్ డిసైడ్ అయ్యాడట.