బ్రహ్మోత్సవం తరవాత శ్రీకాంత్ అడ్దాల ఎవరికీ కనిపించలేదు. ఈమధ్య ఒకట్రెండు సినిమా వేడుకల్లో మెరిశాడంతే. మరోవైపు స్క్రిప్టు పనులు చూసుకుంటూ ఎలాగైనా ఓ నిర్మాతని పట్టాలని ఆరాటపడుతున్నాడు. ఆమధ్య దిల్‌రాజుతో ఓ సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది. ఇప్పుడు శ్రీకాంత్ ని గీతా ఆర్ట్స్ కనికరించింది. గీతా ఆర్ట్స్‌లో శ్రీకాంత్ అడ్డాల ఓ సినిమా చేయబోతున్నాడు. ఇది ఇప్పటి డీల్ కాదు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సమయంలోనే గీతా ఆర్ట్స్నుంచి అడ్వాన్స్ అందుకున్నాడు శ్రీకాంత్ అడ్దాల. ఇప్పుడు.. శర్వానంద్ కోసం ఓ కథ సిద్ధం చేశాడని సమాచారం. ఇటీవల శర్వా – శ్రీకాంత్ లమధ్య భేటీ సాగింది. శ్రీకాంత్ చెప్పిన ‘లైన్’ బాగున్నా.. శర్వా కొన్ని షరతులు విధించాడట. స్క్రిప్టు పక్కాగా ఉండాలని, అన్నీ రాత పూర్వకంగా కనిపించాలని, స్క్రిప్టు ఓకే అయిన తరవాత.. సెట్లో మార్పులూ చేర్పులకూ వీలు ఉండకూడదని గట్టిగా చెప్పాడట. శ్రీకాంత్ అడ్డాల దాదాపుగా ప్రతీ సినిమా స్పాట్లోనే మెరుగులు దిద్దుతుంటాడు. అప్పటి కప్పుడు సీన్ పేపర్ రెడీ చేయడం, ఏ రోజుకారోజు సన్నివేశాల్ని వండడం.. శ్రీకాంత్ పద్ధతి. బ్రహ్మోత్సవం నెగిటీవ్ ఫలితం రావడానికి కారణం.. శ్రీకాంత్ అడ్డాల వైఖరే అని అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ మైనస్‌లను పక్కన పెట్టడానికే శర్వా ఇలాంటి షరతులు విధించాడని చెబుతున్నారు. మరి ఈ షరతులకు శ్రీకాంత్ అడ్డాల ఒప్పుకుంటాడా, లేదంటే.. శర్వాని పక్కన పెట్టి మరో హీరోని చూసుకుంటాడా? అనేది తేలాల్సివుంది.