కర్ణాటక రాజకీయం రసకందాయంలో పడింది..! ప్రభుత్వం ఏర్పాటుకు ఏ పార్టీని గవర్నర్ వజుభాయ్ వాలా ఆహ్వానిస్తారనేది ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. భారతీయ జనతా పార్టీకి 104 సీట్లు వచ్చాయి. కాబట్టి, అతి పెద్ద పార్టీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భాజపాని ముందుగా కోరే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. కానీ, జేడీఎస్ 38, కాంగ్రెస్ 78… ఈ రెండు కూటమిగా ఏర్పడ్డాయి. ఈ రెండు పార్టీల కలయికతో వీరి బలం 116కి చేరింది. అంటే, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ కు ఈ కూటమి చేరుకుంది. ఈ లెక్కన వీరికే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, ఈ రెండింటిలో గవర్నర్ ఎటువైపు మొగ్గు చూపుతారు అనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.
కర్ణాటక గవర్నర్ వజుభాయ్ వాలా విషయానికొస్తే… ఈయన పక్కా గుజరాతీ! ఇంకా చెప్పాలంటే ఆర్.ఎస్.ఎస్. నేపథ్యం ఉన్నవారు. ఇంకాఇంకా చెప్పాలంటే… గుజరాత్ లో 2012 నుంచి 2014 వరకూ స్పీకర్ గా పనిచేశారు. ప్రస్తుతం గవర్నర్ పదవిలో ఉన్నారు కాబట్టి, రాజకీయ రాగద్వేషాలకు ఏమాత్రం తావు లేకుండా వ్యవహరిస్తారని నూటికి నూరు శాతం చెప్పగలమా..? కర్ణాటక ఫలితాల తరువాత.. ఎవరిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలనే అంశంపై ఆయన రాజ్యాంగ నిపుణులతో చర్చిస్తున్నట్టు సమాచారం అందుతోంది.
అయితే, ఇలాంటి పరిస్థితుల్లో ఒక రూల్ ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల ముందు పొత్తు కుదుర్చుకున్న పార్టీల కూటమిని ముందుగా ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ పిలవాలనీ, ఆ పరిస్థితి లేకపోతే.. ఎన్నికల తరువాత పొత్తు కుదుర్చుకున్న పార్టీల కూటమిని ఆహ్వానించాలి. అలాంటి పరిస్థితీ లేనప్పుడు… సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాల్సిన అవసరం ఉంటుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
ఇక, భాజపా విషయానికే వస్తే.. ఎక్కువ సీట్లు వచ్చాయి కాబట్టి, గవర్నర్ ముందుగా పిలవాల్సింది తమనే అని వాదిస్తున్నారు. ఒక్కసారి గతాన్ని పరిశీలిస్తే… మణిపూర్ లో గత ఏడాది భాజపాకి కాంగ్రెస్ కన్నా తక్కువ సీట్లే వచ్చాయి. కానీ, భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మేఘాలయాలో భాజపా కూటమికే ప్రభుత్వ ఏర్పాటు ఆహ్వానం అందింది. 2013లో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి భాజపా కంటే తక్కువ సీట్లే వచ్చాయి. కానీ, ప్రభుత్వ ఏర్పాటు చేసింది. 2005లో కేవలం ఐదు సీట్లతోనే జార్ఖండ్ లో జె.ఎమ్.ఎమ్. ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2002లో కశ్మీరులో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎన్సీ ఉన్నా కూడా, పీడీపీ- కాంగ్రెస్ కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. ఇలాంటివి చాలా ఉన్నాయి. కానీ, ఇప్పుడు కర్ణాటక విషయానికి వచ్చేసరికి… భాజపా నేతల వాదన మరోలా మార్చేశారు. ఈ నేపథ్యంలో గవర్నర్ పాత్ర ఎలా ఉంటుందనేది వేచి చూడాలి.