కర్ణాటక ఎన్నికల్లో గాలి కుటుంబ సభ్యులపై భాజపా చాలా ఆశలు పెట్టుకుంది. గాలి జనార్థన్ రెడ్డి సోదరులు, అనుయాయులతో కలిపి మొత్తంగా ఏడు సీట్లు ఇచ్చింది. అక్రమ మైనింగ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికి భాజపా టిక్కెట్లు ఇవ్వడం తీవ్ర విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే. అయినాసరే, గాలి సోదరుల అంగబలం, అర్థబలంపై భాజపా అపారమైన నమ్మకం పెట్టుకుంది. లాబీయింగ్ చేసి తెచ్చుకున్న సీట్లలో తనవారిని గెలిపించుకోవడం కోసం గాలి జనార్థన్ రెడ్డి స్వయంగా ప్రచార వ్యూహాన్ని పర్యవేక్షించారు. బళ్లారిలోకి గాలి ప్రవేశించకూడదన్న కోర్టు ఆంక్షలు ఉన్నాయి కాబట్టి, 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక బంగ్లాలో బస చేసి మరీ ప్రచారం సాగించారు. తన సోదరులూ స్నేహితుల గెలుపు కోసం బాగానే ఖర్చు చేశారని టాక్!
తీరా ఫలితాలు వచ్చేసరికి ఏమైంది… రెడ్డి సోదరులు, స్నేహితులకు ఇచ్చిన 7 సీట్లలో 3 స్థానాలను మాత్రమే భాజపా గెలుచుకుంది. హరపనహళ్లి నుంచి కరుణాకర రెడ్డి, బళ్లారి నుంచి సోమశేఖర రెడ్డి, మొల్కలమురు నుంచి బి. శ్రీరాములు మాత్రమే గెలుపొందారు. గాలి జానర్థన్ రెడ్డి వర్గం అంతకుమించి ప్రభావం చూపలేకపోయింది. నిజానికి, ఇంతకుమించిన అద్భుతం ఏదో చేస్తారని గాలి జనార్థన రెడ్డి నుంచి భాజపా చాలా ఆశించింది. అందుకే, ఆయనపై ఉన్న కేసులను కూడా క్షమించేస్తున్నామంటూ ఎడ్యూరప్ప ఎన్నికల ముందే చెప్పారు! అది అధ్యక్షుడు అమిత్ షా మాటే. దీంతో, తమకు వెన్నుదన్నుగా ఉన్న పార్టీ రుణం తీర్చుకోవడం కోసం గాలి బాగానే ఖర్చు పెట్టారనీ అంటున్నారు. ఎంత చేసినప్పటికీ బళ్లారి బాబుల ప్రభావం హైదరాబాద్-కర్ణాటక ప్రాంతంలోని బళ్లారి, చిత్రదుర్గ జిల్లాల్లో కొన్ని సీట్లలో విజయానికి మాత్రమే దోహదపడింది.
ఇక, కాంగ్రెస్ పార్టీ కూడా భాజపా మాదిరిగానే మైనింగ్ లాబీని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే ప్రయత్నం బాగానే చేసింది. గత ఎన్నికల్లో గాలి సోదరుల అవినీతిని వేలెత్తి చూపిస్తూ కాంగ్రెస్ లాభపడింది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా మాదిరిగానే మైనింగ్ ‘ఘనుల’కు కాంగ్రెస్ కొన్ని టిక్కెట్లు ఇచ్చింది. ఆనంద్ సింగ్, బి. నరేంద్రతోపాటు లాడ్ సోదరులకు టిక్కెట్లు ఇచ్చింది. ఈ ఇద్దరూ విజయనగర, బళ్లారి రూరల్ నియోజక వర్గాల్లో విజయం సాధించారు. లాడ్ సోదరులు ఓటమి చవిచూశారు. మొత్తంగా, రెండు జాతీయ పార్టీలూ బళ్లారి బాబులపై చాలా ఆశలు పెట్టుకున్నాయి. కానీ, అంతిమంగా వారి ప్రభావం రెండు పార్టీల్లోనూ గతంతో పోల్చితే తగ్గిందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా, భాజపాలో గాలి సోదరగణం హవా పెద్దగా ఫలితాలను రాబట్టలేకపోయిందనే చెప్పాలి. ఓవరాల్ గా కర్ణాటక రాజకీయంలో బళ్లారి బాబుల ప్రభావం మసకబారిందనే అభిప్రాయాన్ని ఈ ఎన్నికల ఫలితాలు కలిగిస్తున్నాయి.