ప్రత్యేక హోదా… ఆంధ్రాలో టీడీపీ, వైకాపా, జనసేనలకు ఇదే కీలక ప్రచారాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇక, కర్ణాటక ఎన్నికల్లో కూడా ప్రచారంలో భాగంగా ఏపీ హోదా అంశం దాదాపు 65 నియోజక వర్గాల్లో కాస్త బలంగానే వినిపించింది! స్థానికంగా ఉన్న తెలుగువారిని ప్రభావితం చేయడం కోసం అక్కడి రాజకీయ పార్టీలు హోదా మంత్రాన్ని జపించాయి. అయితే, ఈ ప్రచారాన్ని భాజపా కూడా సమర్థంగానే తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. హోదా అంశంతో అక్కడి తెలుగువారిని ఒక తాటిమీదికి తెద్దామని జరిగే ప్రయత్నాన్ని… కన్నడ రక్షణ వేదికను తెరమీదికి తీసుకుని రావడం ద్వారా చెక్ పెట్టే ప్రయత్నం భాజపా చేసింది.
తెలుగు ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న 65 నియోజక వర్గాల ఫలితాలను పరిశీలిస్తే… 31 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. 21 స్థానాలను భాజపా కైవసం చేసుకుంది. జేడీఎస్ కి 12 దక్కాయి. బెంగళూరు సిటీలో 7 నియోజక వర్గాలను కాంగ్రెస్ దక్కించుకుంది. భాజపాకి 6, జేడీఎస్ కి 1 దక్కాయి. బెంగళూరు రూరల్ జిల్లాలో జేడీఎస్ కి 2, కాంగ్రెస్ కి 1 స్థానం లభించింది. కోలార్ జిల్లాలో కాంగ్రెస్ 4 నియోజక వర్గాల్లో, జేడీఎస్ ఒక నియోజక వర్గంలో, స్వతంత్ర అభ్యర్థి మరో నియోజక వర్గంలో గెలిచారు. తుముకూరు జిల్లాలో భాజపాకి 2, జేడీఎస్ కి 3, కాంగ్రెస్ కి 2 దక్కాయి. చిక్కబళ్లాపుర జిల్లాలో కాంగ్రెస్ 4, జేడీఎస్ 1 గెలుచుకున్నాయి. బళ్లారి జిల్లాలో కాంగ్రెస్ 5, బళ్లారి సిటీ, సిరుగుప్పా, కూడ్లిగి.. ఈ మూడు చోట్లా భాజపా గెలిచింది. రాయచూరు జిల్లాలో రాయచూరు సిటీ, దేవదుర్గలను భాజపా గెలుచుకుంది. రాయచూరు రూరల్, లింగసుగూరులలో కాంగ్రెస్ విజయం సాధించింది. మరో రెండు సీట్లు జడీఎస్ కి దక్కాయి. హైదరాబాద్-కర్ణాటక ప్రాంతంలోని కలబురిగి జిల్లాలో కలబురిగి టౌన్ ఒక్కటే భాజపాకి దక్కింది. చిత్తాపూర్, బీదర్, జీవర్గి, హుమ్నాబాద్ లు కాంగ్రెస్ కి, గుర్మిట్కల్, బీదర్ రూరల్ నియోజక వర్గాల్లో జేడీఎస్ గెలిచింది. కొప్పళ్ల జిల్లాలో కాంగ్రెస్ కి 1, భాజపాకి 2 సీట్లు దక్కాయి. చిత్రదుర్గం జిల్లాలో భాజపాకి 2, కాంగ్రెస్ కి 1. దావణగెరె దక్షణి నియోజక వర్గంలో కాంగ్రెస్ విజయం సాధించింది.
ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని ఇతర పార్టీలు తీవ్రంగా అక్కడి ప్రజల్లోకి తీసుకెళ్లినా, భాజపా ప్రచార వ్యూహంతోపాటు స్థానిక అంశాల ప్రభావం కూడా అక్కడి తెలుగువారిపై కొంత పడిందని చెప్పొచ్చు. పైగా, ఏపీ నుంచి కూడా కొన్ని రాజకీయ పార్టీలు భాజపాతో ఉన్న సంబంధ బాంధవ్యాలకు అనుగుణంగా అక్కడి తెలుగువారిని ప్రభావితం చేసే ప్రయత్నాలూ చేశాయన్న సంగతి తెలిసిందే. కానీ, ఓవరాల్ గా చూసుకుంటే తెలుగు ప్రభావిత నియోజక వర్గాల సంఖ్య 65 ఉన్నాయి. వాటిలో కేవలం 21 మాత్రమే భాజపాకి దక్కాయి.