కర్ణాటకలో ఏ పార్టీకి మెజార్టీ రాలేదు. సాధారణ మెజార్టీకి 112 ఎమ్మెల్యే సీట్లు అవసరం. కానీ బీజేపీ 104 దగ్గరే ఆగిపోయింది. కాంగ్రెస్ 78, జేడీఎస్ 38 గెలుచుకున్నాయి. ఈ రెండు పార్టీలు కలిస్తే సాధారణ మెజార్టీ కన్నా నాలుగు ఎమ్మెల్యే సీట్లు ఎక్కువే. ఇద్దరు ఇండిపెండెంట్లు కూడా వీరికే మద్దతు ప్రకటించారు. ఈ రెండు పార్టీలు వెళ్లి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిచాలని కూడా కోరారు. కానీ అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ నేతలు కూడా… గవర్నర్ ను కలిశారు. తమనూ ఆహ్వానించాలన్నారు. దీంతో ఇప్పుడు గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నదానిపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. గవర్నర్.. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అత్యంత సన్నిహితుడు. ఆయన గుజరాత్ సీఎం అవడానికి తన సీటును త్యాగం చేశారు.తర్వాత గుజరాత్ మోదీ కేబినెట్లో మంత్రిగా చేశారు. స్పీకర్గా కూడా చేశారు. దానికి ప్రతిఫలంగానే గవర్నర్ గిరీ దక్కించుకున్నారు.
గతంలో ఇలాంటి పరిస్థితులే వచ్చినప్పుడు…ఎస్.ఆర్.బొమ్మై కేసులో సుప్రీంకోర్టు నాలుగు స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చింది. ఏ రాష్ట్రంలో అయినా ఎన్నికలు ముగిసిన తర్వాత పూర్తి మెజార్టీ సాధించిన పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవడం మొదటిది. ఒకవేళ ఒకే పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోతే.. కూటమిగా కలసి పోటీ చేసిన వారికి ఆహ్వానం ఇవ్వడం. ఇలా కూడా.. ఎవరికీ మెజార్టీ రాకపోతే.. ఫలితాలు వచ్చిన తర్వాత కూటమి ఏర్పడి మెజార్టీ ఉందనుకున్నవారిని ఆహ్వానించడం. అది కూడా సాధ్యం కాకపోతే.. అతి పెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం. మొదటి మూడు ఆప్షన్లలో… పార్టీలకు కానీ.. కూటములకు కానీ మెజార్టీ ఉంటుంది. అలా ఉన్నప్పుడు.. .మెజార్టీ లేకపోయినా… అతి పెద్ద పార్టీని ఆహ్వానించకూడదు. అంటే..ఇప్పుడు గవర్నర్ కాంగ్రెస్ – జేడీఎస్ కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సి ఉంటుంది.
ఇటీవల గోవా, మేఘాలయ, మణిపూర్ లాంటి రాష్ట్రాల్లో బీజేపీ నేతృత్వంలో కూటమి ప్రభుత్వాలు ఏర్పటయ్యాయి. ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించింది. కానీ ఆయా రాష్ట్రాల గవర్నర్లు … కాంగ్రెస్ ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించలేదు. నేరుగా బీజేపీ నేతృత్వంలోని కూటమిని ఆహ్వానించారు. వారు చెప్పిన కారణం.. కాంగ్రెస్ కు మెజార్టీ లేదు.. బీజేపీ నేతృత్వలోని కూటమి ఉందనే. ఇప్పుడు కర్ణాటకలో జేడీఎస్ – కాంగ్రెస్ కూటమికి మెజార్టీ ఉంది. కానీ గవర్నర్ మాత్రం పిలుపు విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. మెజార్టీ లేకపోయినా అతి పెద్ద పార్టీ అన్న కారణంతో…ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇస్తే.. బేరసారాలకు అవకాశం ఇచ్చినట్లేనన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ కూడా.. కుమారస్వామికి అవకాశం ఇవ్వకపోతే.. న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకుంది. ఇప్పటి వరకూ ఎస్ఆర్ బొమ్మై కేసులో.. సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగే.. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో గవర్నర్లకు ప్రామాణికంగా ఉంటూ వస్తోంది. ఇప్పుడు కర్ణాటక గవర్నర్ ఏం చేస్తారనే దానిపై .. ఆసక్తి ఏర్పడింది.