దేశంలో గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్. రాజకీయాలు ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా మార్చుకుంటూ పోతేనే సక్సెస్ అవుతారు. మేము సీనియర్లం కాబట్టి.. ఇలాగే ఉంటామంటే.. ఎక్కడ ఉన్న వాళ్లు అక్కడే ఉండిపోతారు. అలా ఉండిపోయారంటే.. వెనుకబడిపోయినట్లే. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి అదే. గతంలో చిన్న రాష్ట్రాలే కదా.. అని లైట్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు చేతిలో ఉన్న ఏకైక అతి పెద్ద రాష్ట్రం కర్ణాటకపై ఆ ప్రభావం పడుతోంది. తాము గెలవకపోయినా.. బీజేపీకి అధికారం దక్కనీయకూడదన్న ఉద్దేశంతో బీజేపీ వ్యూహాలు పన్నుతోంది. కానీ ఈ పని ఎప్పుడో గుజరాత్, మేఘాలయ, మణిపూర్ ఎన్నికల్లోనే చేయాల్సిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
కర్ణాటకలో హంగ్ అసెంబ్లీ ఖాయమని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడంతో… కౌంటింగ్ ముందు రోజు ఢిల్లీ నుంచి గులాంనబీ ఆజాద్, ఆశోక్ గెహ్లాట్ హుటాహుటిన బెంగుళూరు వచ్చారు. వెంటనే జేడీఎస్‌తో చర్చలు ప్రారంభించారు. కొంత వరకు … కౌంటింగ్ ముందు రోజే పరిస్థితులు చక్కదిద్దారు. అందరూ అనుకుంటున్నట్లుగానే… ఫలితాలు హంగ్ అయ్యాయి. మధ్యలో బీజేపీ లీడ్‌లోకి వచ్చినా… వారు వెనక్కి తగ్గలేదు. కుమారస్వామి, దేవేగౌడలతో చర్చిస్తూనే ఉన్నారు. నేరుగా సోనియాగాంధీతో… దేవేగౌడను మాట్లాడించారు. కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్‌కు మద్దతిచ్చిన మాయావతితో కూడా ఫోన్ చేయించారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి కూడా… దేవేగౌడకు ఫోన్ చేసి.. కాంగ్రెస్ మద్దతు తీసుకోవాలని కోరారు. దాంతో దేవేగౌడ కాంగ్రెస్ వైపే మొగ్గుచూపారు.
మొత్తానికి కాంగ్రెస్ తాము గతంలో చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకున్నట్లుగానే కనిపిస్తోంది. గోవాలో..మణిపూర్‌లో కొద్దిగా ప్రయత్నిస్తే.. ప్రభుత్వ ఏర్పాటు చేసే అవకాశం వచ్చేది. కానీ అప్పుడు కాంగ్రెస్ నేతలు మిన్నకుండి పోయారు. దాంతో సొంత పార్టీలోనే విమర్శలు వచ్చాయి. కొంత మంది నేతలు అసంతృప్త స్వరం కూడా వినిపించారు. ఈ సారి కర్ణాటక విషయంలో ఎలాంటి తప్పులు జరగకుండా… కాంగ్రెస్ జాగ్రత్తలు తీసుకుంది. గత ఎన్నికల నుంచి గుణపాఠాలు నేర్చుకుని.. కర్ణాటకలో పాఠాలు చెబుతోంది.
చిన్న రాష్ట్రాల కోసం అప్పుడు కక్కుర్తి..! ఇప్పుడు చిక్కుల్లో బీజేపీ..!!
కేంద్రంలో భారతీయ జనతాపార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు, ఫలితాలకు,ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మధ్య చిత్రమైన ప్రజాస్వామ్యాన్ని తెరపైకి తెచ్చింది. ఏ పార్టీకి మెజార్టీ రాకుండా..హంగ్ అనే పదం వినిపిస్తే.. అది బీజేపీ ఖాతాలోకి వెళ్లిపోయినట్లే. బీజేపీకి కనీసం పది శాతం సీట్లు రాకపోయినా… పరిస్థితి మాత్రం స్మూత్‌గా మారిపోయేది. బీజేపీ పాలిత ప్రభుత్వాలు ఏర్పటయ్యేవి.
సాధారణంగా ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో ప్రభుత్వ ఏర్పాటు కోసం మొదట గవర్నర్ ఆహ్వానిస్తారు. అనాదిగా వస్తున్న సంప్రదాయం ఇది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితిని మార్చేసింది. గోవా, మణిపూర్, మేఘాలయాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి…చాలా అప్రజాస్వామిక చర్యలకు పాల్పడ్డారు. గోవా అసెంబ్లీలో 40 స్థానాలున్నాయి. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 17 వచ్చాయి. బీజేపీకి 13 మాత్రమే వచ్చాయి. కానీ అక్కడ గవర్నర్ బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. మణిపూర్‌లో వరుసగా నాలుగు సార్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కొన్నాళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో పూర్తి మెజారిటీ సాధించలేకపోయింది. కానీ ఏకైక పెద్ద పార్టీగా అవతరించింది. 60 స్థానాలు ఉన్న మణిపూర్‌లో కాంగ్రెస్ 28 సీట్లు వచ్చాయి. బీజేపీకి 21 స్థానాలు మాత్రమే దక్కాయి. సాధారణ మెజార్టీకి కేవలం మూడంటే మూడు సీట్ల దూరంలో ఉన్న కాంగ్రెస్‌ను పక్కకు నెట్టేసి కుర్చీ ఎక్కడానికి బీజేపీకి గవర్నర్ అవకాశం ఇచ్చారు. మేఘాలయాలో కూడా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఝలక్ ఇచ్చింది. మేలయ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 22 సీట్లు సాధించి కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. కేవలం రెండు సీట్లు మాత్రమే వచ్చిన బీజేపీ రింగు తిప్పింది. కాంగ్రెస్‌ను అధికారానికి దూరం చేసింది.
నిజానికి ఇలా దొడ్డిదారిలో పీఠాలు పొందడం.. కాంగ్రెస్‌కు కూడా కొత్త కాదు. కానీ ప్రతీ రోజూ కాంగ్రెస్‌ను విమర్శిస్తూ అదే కాంగ్రెస్ చేసిన దాని కంటే.. ఎక్కువ ప్రజాస్వామ్య హననం చేస్తున్నారు బీజేపీ అగ్రనేతలు. కానీ ఇప్పుడు వారికి అతి పెద్ద సవాల్ ఎదురయింది. చిన్న రాష్ట్రాల్లో తాము చేసినట్లు..కర్ణాటకలో చేయాలంటే… బీజేపీ కంటే ముందు కాంగ్రెస్ – జేడీఎస్ కూటమికి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే.. ఈ రెండు పార్టీలకు కలిపి మెజార్టీ ఉంది. అలా కాకుండా.. బీజేపీకి మొదట ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇస్తే మాత్రం..బీజేపీ మార్క్ ప్రజాస్వామ్యంపై చాలా విమర్శలొస్తాయి.