రైతుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మధ్య చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నట్టున్నారు. ఇప్పటికే, రైతుబంధం పథకం చెక్కుల పంపిణీ మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు, రైతులందరికీ బీమా సౌకర్యం వర్తింపజేయాలనీ, దీనికి సంబంధించిన కార్యాచరణ, విధివిధానాలను తయారు చేయాలంటూ అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలోని రైతులందరికీ కలిపి గ్రూప్ ఇన్సూరెన్స్ చేయించాలని భావిస్తున్నారు. మరణించిన రైతు కుటుంబానికి రూ. 5 లక్షలు అందించాలన్న నిర్ణయం ఇతర రాష్ట్రాలకు ఆదర్శవంతంగా మారుతుందని కేసీఆర్ చెప్పారు.
సమైక్య రాష్ట్రంలో రైతులు నిరాదరణకు గురయ్యారనీ, తెలంగాణ ఏర్పడ్డ తరువాత రైతుల స్థితిగతులు మెల్లగా మెరుగౌతున్నాయని చెప్పారు. ఏ కారణంతో రైతు మరణించినా ఆ కుటుంబానికి భరోసా కల్పించాలన్న ఉద్దేశంతోనే బీమా పథకం అమలు చేయాలనుకుంటున్నామన్నారు. దీంతో అన్నదాతల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. రైతుల తరఫున బీమాను ప్రభుత్వమే చెల్లిస్తుందనీ, దీని కోసం బడ్జెట్ లో ప్రత్యేక కేటాయింపులు కూడా ఉంటాయని ముఖ్యమంత్రి చెప్పారు. రైతులకు బీమా పథకం ప్రభుత్వమే కల్పించడం అనేది దేశంలోనే మొట్టమొదట తెలంగాణలోనే జరుగుతోందన్నారు.
రైతుబంధు పథకం ద్వారా పంటముందుగానే రైతులకు పెట్టుబడి ఇవ్వాలన్న నిర్ణయాన్ని అందరూ మెచ్చుకున్నారు. దేశంలో ఈ తరహా ఆలోచన ఏ రాష్ట్రమూ చెయ్యలేదు. ఇప్పుడు, అలాంటిదే ఈ బీమా పథకం కూడా! రైతు బంధు మాదిరిగానే.. సన్నకారు, చిన్నకారు, పెద్ద రైతులు అనే తేడా లేకుండా అందరికీ ప్రభుత్వమే బీమా చెల్లించేస్తుందని ముఖ్యమంత్రి చెబుతున్నారు. ఈ పథకం వర్తింపుపై కూడా స్పష్టమైన విధివిధానాలు వెల్లడించాల్సి ఉంది. నిజానికి, ఆకస్మికంగా రైతు మరణిస్తే ప్రభుత్వం తరఫున వెంటనే ఆ కుటుంబాన్ని ఆదుకునే పథకాలు ఇప్పటికే కొన్ని ఉన్నాయి. ఇది కూడా కొంత ప్రయోజనకరమైన పథకమే అయినప్పటికీ… ఎన్నికలకు ఏడాది ముందు రైతులపై ఇంతగా వరాలు కురిపిస్తూ ఉండటం, ప్రతిపక్షాలకు విమర్శించే అవకాశం ఇవ్వడమే అవుతుంది. పైగా, పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో రైతులపై ఇంత ప్రేమను కురిపిస్తూ ఉంటే… దీన్ని కూడా ఓటు బ్యాంకు పాలిటిక్స్ కోణం నుంచి విశ్లేషించే అవకాశాలే ఎక్కువ..!