నా నువ్వే సినిమాని ముందు నుంచీ `మణిరత్నం టైపు లవ్ స్టోరీ` అంటూ ప్రమోట్ చేస్తూ వచ్చారు. పాటలు, ప్రచార చిత్రాలూ చూస్తే అది నిజమే అనిపించింది. ట్రైలర్‌తో ఇదో కూల్ లవ్ స్టోరీ అని రూఢీ అయిపోయింది. కల్యాణ్ రామ్ ఎక్కువగా మాస్ సినిమాలు చేస్తుంటాడు. అతనికి అవి కలిసొచ్చాయి కూడా. తన కెరీర్లో తొలిసారి ఓ పూర్తి స్థాయి ప్రేమకథా చిత్రం చేస్తున్నాడిప్పుడు. అదే.. నా నువ్వే. తమన్నా కథానాయికగా నటించిన ఈ చిత్రానికి జయేంద్ర దర్శకుడు. పీసీ శ్రీరామ్ లాంటి కెమెరామెన్ ఈ టీమ్‌కి అండగా ఉన్నాడు. ఆయన కూల్ మాంటేజస్, టేకింగ్‌తో ఈ కథకి ప్రాణం పోశాడనిపిస్తోంది. ప్రేమలో ఉండే.. చిన్న చిన్న దూరాలు, గాయాలతో… ఓ కథని తయారు చేసినట్టు అనిపిస్తోంది. కెమెరా… కల్యాణ్ రామ్ కంటే – తమన్నాపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. తమన్నా కోణంలోంచి నడిచే లవ్ స్టోరీ అని స్పష్టంగా అర్థమైపోతోంది. మణిరత్నం – పీసీ శ్రీరామ్‌లు కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు చేశారు. అందులో లవ్ స్టోరీలూ ఉన్నాయి. అందుకే ఆ ఫ్లేవర్.. ఈ సినిమాలోనూ కనిపించబోతోంది. రెగ్యులర్ సినిమాల్లా పంచ్ డైలాగులు, మాస్ బీట్లు, స్టెప్పులు, ఫైట్లు ఎక్కడా చూపించలేదు. నా నువ్వే టైటిల్ ఎంత సాఫ్ట్‌గా ఉందో.. ట్రైలర్ అంతే స్మూత్‌గా ఉంది. తొలిసారి కల్యాణ్ రామ్ చేస్తున్న ఈ ప్రయత్నం ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.