ప్రస్తుతం బయోపిక్‌ల హవా నడుస్తోంది. కాస్త నేమూ, ఫేమూ ఉండి.. వాళ్ల జీవితంలో డ్రామా కనిపిస్తే బయోపిక్ తీయడానికి ‘సరుకు’ దొరికేసినట్టే అని ఫీలవుతున్నారు దర్శక నిర్మాతలు. సినిమా గురించి సినిమా తీస్తే..? ఈ ఐడియా మాత్రం సినీ మేధావి రాంగోపాల్ వర్మకి వచ్చింది. అవును… తన సినీ ప్రయాణం మొదలైన ‘శివ’ సినిమా గురించి ఓ సినిమా రాబోతోంది. అసలు ‘శివ’ అనే ఐడియా ఎక్కడ మొదలైంది? వర్మ దాన్ని ఎవరెవరితో పంచుకున్నాడు? నాగార్జునకు ఈ కథ చెప్పి ఎలా ఒప్పించాడు? ఆ సినిమా ప్రయాణంలో జరిగిన సంగతులేంటి? ఇవన్నీ కలసి ఓ సినిమా తీస్తే బాగుంటుందన్నది వర్మ అయిడియా. కాకపోతే ఈ చిత్రానికి వర్మ దర్శకుడు కాదు, కనీసం నిర్మాత కూడా కాదు. జస్ట్ ఐడియా ఇచ్చాడంతే.
ఈమధ్య రాంగోపాల్ వర్మ దగ్గరకు ఓ యువ దర్శకుడు వచ్చి ‘మీ జీవిత కథని సినిమాగా తీస్తా’ అని అడిగాడట. దానికి వర్మ ‘నా జీవితంలో పెయిన్ లేదు. నా కథ సినిమా స్టోరీగా పనిచేయదు’ అని చెప్పాడట. అయితే.. ‘శివ సినిమా ప్రయాణాన్ని సినిమాగా తీస్తే బాగుంటుంది’ అని ఐడియా ఇచ్చాడట. ఈ ఐడియ బాగుండడంతో ఆ యువ దర్శకుడు ప్రస్తుతం ‘శివ’ తాలుకూ కథని, ఆ ప్రయాణాన్నీ ఆధారం చేసుకుని ఓ స్క్రిప్టు తయారు చేసుకుంటున్నాడు. తెలుగు సినీ చరిత్రలో మైలురాళ్లు అనదగ్గ సినిమాల్లో ‘శివ’కూడా ఉంటుంది. ఆసినిమా తాలుకూ సంగతుల్ని తెలుసుకోవడానికి ఇప్పటికీ ఉత్సాహం చూపిస్తుంటారు. వాళ్లందరికీ ‘శివ’ హిస్టరీపై సినిమా తీయడం ఆకట్టుకునే విషయమే. ఈ ప్రయత్నం గనుక సక్సెస్ అయితే సినిమాలపై సినిమాలు అనే ట్రెండ్ శ్రీకారం చుట్టుకుంటుంది.