కర్ణాటక ఫలితాల అనంతరం ఆంధ్రాలో కీలక రాజకీయశక్తిగా ఎదుగుతామని తాను చెప్పాననీ, ఇది భాజపా పలికే ప్రగల్బాలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారని భాజపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు అన్నారు. కానీ, ఏమైందనీ, వారం రోజుల్లోనే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు చుక్కెదురైందని జీవీఎల్ చెప్పారు. కర్ణాటక ప్రజలు నమ్మని అసత్యాలను, ఆంధ్రా ప్రజలకు ఎలా చెబుతారని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీకి ఇప్పటికైనా బుద్ధి రావాలనీ, ప్రచారమే ప్రభుత్వం అనుకుంటూపోతే.. సిద్ధరామయ్య కంటే దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాగూ పోతుందనీ, రాష్ట్రంలో తీవ్రమైన అవినీతి ఎదుర్కొంటున్న టీడీపీ, స్వయంగా భాజపాతో బంధం తెంచుకోవడం తమకు ఒక వరంగానే భావిస్తున్నామని జీవీఎల్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ పట్ల తమకు ఉన్న చిత్తశుద్ధిని ప్రజలు గమనిస్తున్నారనీ, కర్ణాటకలో అక్కడి ప్రజలు ఏవిధంగా అయితే బ్రహ్మరథం పెట్టారో.. ఆంధ్రాలో తమకు అంతకుమించి తమను కోరుకుంటున్నారని అన్నారు. కర్ణాటక, త్రిపుర, మహారాష్ట్ర… ఎక్కడైనా సరే ప్రజలు తమనే కోరుకుంటున్నారని జీవీఎల్ స్పష్టం చేశారు. రాజకీయ విలువలు కలిగిన పార్టీగా ఆంధ్రాలో తమకు ప్రజాదరణ లభిస్తుందనీ, అదరహో అనిపిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న జీవీఎల్, సోషల్ మీడియా ద్వారా ఒక వీడియో పోస్ట్ చేశారు. దాన్లో ఆయన మాట్లాడినవి ఇవే..!
కర్ణాటకలో మాదిరిగానే ఆంధ్రాలోనూ ప్రభావం చూపుతామని జీవీఎల్ అంటున్నారు! నిజానికి, కర్ణాటకలో భాజపా ఎప్పట్నుంచో ఉంది. సిద్ధరామయ్యకు ముందు భాజపా ప్రభుత్వం కూడా ఏర్పడింది. ఆంధ్రాలో ఆ స్థాయిలో ఇంతవరకూ ప్రభావితం చూపిన గతం లేదు. కాబట్టి, కర్ణాటక ఫలితమే ఆంధ్రాలో రిపీట్ అవుతుందని ఆశించడం అత్యాశే అవుతుంది. ఇక, విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్న భాజపా అన్నారు! కర్ణాటక ఫలితాల్లో అధికారపు అంచుల వరకూ వెళ్లి, సంఖ్యాబలం చాలక చతికిలపడింది. అయినాసరే, అధికారం కోసం వారు ప్రస్తుతం సాగిస్తున్న రాజకీయాల్లో విలువలు ఏపాటివో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్, జేడీఎస్ కూటమికి ప్రభుత్వం ఏర్పాటు చేయగల సంఖ్యా బలం ఉన్నా… ఆ రెండు పార్టీల నుంచి ఎమ్మెల్యేలను లాక్కునేందుకు వారు చేస్తున్న ప్రయత్నాలను ఏ తరహా విలువలతో కూడినవో జీవీఎల్ చెప్పాలి. ఇంకోటి, సిద్ధరామయ్య కంటే దారుణమైన పరిస్థితులను చంద్రబాబు ఎదుర్కోవాలని హెచ్చరించడం మరీ విడ్డూరం. ప్రతీసారీ జీవీఎల్ హెచ్చరికలేంటో అర్థం కావడం లేదు. నిన్నటికి నిన్న రామ్ మాధవ్ కూడా ఇలానే అక్కసు వెళ్లగక్కారు. అంటే, ఏపీ మీద భాజపా అంత ఆగ్రహంతో ఉందా..? కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చనిది వారు, ఏపీ ప్రయోజనాలను నిర్లక్ష్యం చేసింది వారు! రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడాలన్న బాధ్యతని గాలికి వదిలేసి, ప్రశ్నిస్తున్న రాష్ట్రాలపై కక్ష సాధిస్తారా..?