కాంగ్రెసేతర, భాజపాయేతర పార్టీల ఫెడరల్ ఫ్రెంట్ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. దేశంలోని రెండు జాతీయ పార్టీలూ ఘోరంగా విఫలమౌతున్నాయనీ, దేశానికి కొత్త దిశానిర్దేశం అవసరమంటూ ఒక అజెండాతో ఫ్రంట్ ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్లో భాగంగానే కర్నాటక వెళ్లి, జేడీఎస్ అధ్యక్షుడు దేవెగౌడని, ఆయన కుమారుడు కుమారస్వామిని కలుసుకున్నారు. రెండు జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు కాబోతున్న కూటమికి వారి మద్దతూ ఉంటుందని ప్రకటించారు. అయితే, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. ఆ రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మౌనం దాల్చారు! మంత్రి కేటీఆర్ కూడా ఇంతవరకూ ఆ రాష్ట్ర ఎన్నికల ఫలితాలపై స్పందించలేదు.
కర్ణాటక ఎన్నికల తరువాత కేసీఆర్ కు రెండు అంశాలపై స్పష్టత వచ్చి ఉంటుంది..! మొదటిది… దేశవ్యాప్తంగా కాంగ్రెస్, భాజపాలపై ప్రజలు విసుగుతో ఉన్నారన్నారు. కానీ, కర్ణాటక ఫలితాలు ఆ పరిస్థితిని ప్రతిబింబించలేదు. మొదటి స్థానంలో భాజపా, రెండో స్థానంలో కాంగ్రెస్ నిలిచింది. ఈ రెండుపార్టీలకు అతీతంగా ఫెడరల్ ఫ్రెంట్ లో కీలక పాత్ర పోషిస్తారనుకున్న జేడీఎస్ మూడో స్థానానికి పరిమితమైంది. ఇక, రెండోది.. కాంగ్రెస్, భాజపా.. ఈ రెండు పార్టీలను వ్యతిరేకించాల్సిన అవసరం ఇతర రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలకు లేదనేది! కేసీఆర్ కు తెలంగాణలో కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి. తెలంగాణలో 2019లో భాజపా ప్రభావం అంత తీవ్రంగా ఉండే పరిస్థితి లేదు. కాబట్టి, భాజపాయేతరం, కాంగ్రెసేతరం అంటూ ఆయన వేసిన ఫ్రెంట్ పునాదిలో రాష్ట్ర రాజకీయ అవసరాలే ఎక్కువగా ఉన్నాయి. జాతీయ స్థాయి కామన్ అజెండా ఇక్కడే సరిగా కుదర్లేదని చెప్పొచ్చు. ఫ్రెంట్ లో ముందుంటారనుకున్న దేవెగౌడ, ఇప్పుడు కాంగ్రెస్ కు మద్దతు పలికారు. దీనిపై కూడా కేసీఆర్ స్పందించలేని పరిస్థితి.
అయితే, కర్ణాటక ఫలితంపై తెరాస ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ… దేశానికి సారథ్యం వహించే సామర్థ్యం కాంగ్రెస్ కి లేదని కర్ణాటక ఫలితాలు రుజువు చేశాయని విశ్లేషించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు వ్యతిరేకమని అర్థమౌతోందన్నారు. ఇదే సమయంలో భాజపా గురించి మాట్లాడుతూ… ఆ పార్టీని కూడా ప్రజలు పూర్తి స్థాయిలో ఆదరించిన పరిస్థితి లేదన్నది గుర్తించాలన్నారు. కాబట్టి, రెండు జాతీయ పార్టీలపై ప్రజలకు పూర్తిస్థాయి నమ్మకం లేదనడానికి ఈ ఫలితాలే ఉదాహరణ అని ముక్తాయించారు. ఇది తెరాస ఫెడరల్ ఫ్రెంట్ వాదనకు అనుకూలమైన అభిప్రాయం. వాస్తవమైతే… రెండు జాతీయ పార్టీలతో సమాన దూరం పాటించాల్సిన అవసరం ఇతర రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలకు లేదు. కాబట్టి, కాంగ్రెసేతరం, భాజపాయేతరం అనే మూల సూత్రం పెట్టుకుని కూటమి కట్టాలని అనుకుంటే… ఇవాళ్టి కర్ణాటక అనుభవమే, రేపు మరో రాష్ట్రంలోనూ కేసీఆర్ కు ఎదురుకావొచ్చు. మొత్తానికి, కేసీఆర్ కి కొత్త మిత్రుడు షాక్ ఇచ్చినట్టే..!